మంగళగిరి | హేకృష్ణా ఇదేమి అపచారం!! విగ్రహ తరలింపునకు అధికారుల యత్నం

by Thanuru Gopichand |

మంగళగిరిలో (Mangalagiri) పట్టపగలే అపచారం జరిగిందని స్థానిక భక్తులు వాపోయారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో ఆందోళనకు దిగారు.

మంగళగిరి | హేకృష్ణా ఇదేమి అపచారం!! విగ్రహ తరలింపునకు అధికారుల యత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళగిరిలో (Mangalagiri) పట్టపగలే అపచారం జరిగిందని స్థానిక భక్తులు వాపోయారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో ఆందోళనకు దిగారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తరలిస్తున్నామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆకస్మికంగా విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో మంగళగిరిలోని యాదవపాలెంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. అయితే స్థానికుల కథనం ప్రకారం మంగళగిరిలోని యాదవపాలెంలో శ్రీకృష్ణునిని విగ్రహాన్ని (Sri Krishna Idol) ఏర్పాటు చేశారు. ఆ స్థలం తమదేనంటూ మునగపాటి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీంతో విగ్రహాన్ని తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు సిబ్బందితో పాటు విగ్రహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న యాదవ సంఘాల నేతలు, సభ్యులు, స్థానిక భక్తులు అక్కడకు వెంటనే చేరుకున్నారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని తొలగిస్తే మరోచోట ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున యాదవ సంఘం వారితో పాటు భక్తులు అక్కడకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాలతోనే తరలిస్తున్నప్పటికీ తమకు కొంత సమయం ఇస్తే శాస్త్రోకంగా వేరే ప్రాంతంలో ప్రతిష్టాపన చేస్తామని యాదవ సంఘం నేతలు విన్నవించారు. చివరకు విగ్రహ తరలింపునకు యాదవ సంఘం నేతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణగింది. ఇలా ఆకస్మికంగా దేవాలయాలు, విగ్రహాలను తరలించే ప్రయత్నం చేయడం వల్ల వివాదాలు తలెత్తుతాయని.. భక్తులతో చర్చించి సానుకూల వైఖరితో తరలింపు జరగాలని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Next Story