స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. పార్టీ నేతలకు మంత్రి లోకేశ్ కీలక సూచనలు

by Ramesh Naini |

తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కీలక దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. పార్టీ నేతలకు మంత్రి లోకేశ్ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే అధినాయకత్వం ఎంతమాత్రం ఉపేక్షించదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, వలసలు, క్రమశిక్షణపై ఆయన గట్టి సందేశం ఇచ్చారు.

అవకాశవాదులకు గ్యారెంటీ లేదు

వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చే నేతల విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు. కేవలం అవకాశవాదం కోసమే పార్టీ మారే వారు ఎల్లప్పుడూ టీడీపీలో కొనసాగుతారనే గ్యారెంటీ లేదన్నారు. పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకుని నిలబడిన నిజమైన కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తేల్చి చెప్పారు. కష్టపడే ప్రతి కార్యకర్తకూ పార్టీలో కచ్చితంగా సముచిత గుర్తింపు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. అందుకనుగుణంగా శ్రేణులను సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్

రెవెన్యూ, భూ వివాదాల్లో ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఇసుక, గ్రావెల్ తదితర అక్రమ రవాణాకు పాల్పడినా, ఇతరులను బెదిరింపులకు గురిచేసినా సహించేది లేదన్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏ నాయకుడు ప్రవర్తించినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Next Story