- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబ్జా భూమిలో మద్యం షాపు.. కుందేరు మురుగు కాలువ ఆక్రమణ
మద్యం పాలసీని కేవలం ఆదాయ సాధనంగా కాకుండా ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధానంలో నడపాలని, ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు జోక్యం రుజువైతే కఠిన చర్యలు తప్పవని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

దిశ ప్రతినిధి, బాపట్ల: మద్యం పాలసీని కేవలం ఆదాయ సాధనంగా కాకుండా ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధానంలో నడపాలని, ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు జోక్యం రుజువైతే కఠిన చర్యలు తప్పవని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయినప్పటికీ చీరాల నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటమే కాకుండా, ప్రతి మద్యం షాపు యాజమాన్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తూ విచ్చలవిడి మద్యం అమ్మకాలు కొనసాగిస్తోంది. ప్రతి బెల్ట్ షాపు నుంచి నెలకు పదివేల రూపాయలు మామూళ్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు అందుతున్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రజా ప్రతినిధుల అనైతిక చర్యల వలన రాష్ట్ర ప్రభుత్వం తలవంపులకు గురికావాల్సి వస్తోంది.
కబ్జా భూమిలో వైన్స్..
వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయితీ నాయునిపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నెంబరు 145 కుందేరు డ్రైన్ (మురుగు కాలువ) భూమిని కబ్జా చేసిన ఓ వైన్స్ యాజమాన్యం అక్రమ భవన నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. కబ్జా చేసిన భూమిలో షాపు ఏర్పాటుకు అనుమతులు మంజూరు కావడంతో ఎక్సైజ్ శాఖ చిత్తశుద్ధి పై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంత జరుగుతున్నా డ్రైనేజీ, రెవెన్యూ విభాగాల అధికారులు మౌనం వహించడం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరాల నియోజకవర్గంలో కుందేరు డ్రైన్ ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించి ప్రకృతి వనరులను సంరక్షించాలని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సైతం బుట్ట దాఖలు చేసిన డ్రైనేజీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలపై ఇటీవల విధుల నుంచి తొలగించబడిన వేటపాలెం తహసిల్దారు సహకారంతో కుందేరు భూమిలో అక్రమంగా షాపు నిర్మాణం రేపటినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అయిన కుందేరు పరివాహక ప్రాంతంలో పంచాయతీ అధికారులు ఏకంగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' మంజూరు చేయడంతో, కబ్జా భూమిలో నిర్మించిన మద్యం షాపుకి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సర్వీసు మంజూరు చేసి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అధికారులు ఏమంటున్నారంటే..
సదరు వైన్స్ భూ కబ్జా, విచ్చలవిడి మద్యం అమ్మకాలు వ్యవహారంపై వివరణ కోరేందుకు స్థానిక ఎక్సైజ్ అధికారులను చరవాణి ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు. చల్లారెడ్డి పాలెం పంచాయితీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ గతంలో అధికారులు అనుమతులు మంజూరు చేసి ఉండొచ్చన్నారు. కార్యాలయం రికార్డులు పరిశీలించి చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. డ్రైనేజీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కుందేరు ఆక్రమణల తొలగింపు విషయమై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఆదేశానుసారం రెవెన్యూ అధికారుల సహకారంతో నియోజకవర్గ పరిధిలో ఆక్రమణలను గుర్తించి తక్షణమే తొలగించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారిని కోరుతూ నివేదిక పంపినట్లు వెల్లడించారు. మద్యం షాపు నిర్మాణం వ్యవహారం తన దృష్టిలో లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చట్టపరమైన చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు.






