రాజీనామా చేసి పో.. సీఎం జగన్‌పై Chandrababu తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 16 |
రాజీనామా చేసి పో.. సీఎం జగన్‌పై  Chandrababu తీవ్ర ఆగ్రహం
X
  • వైఎస్ జగన్ తిక్క సీఎం...సైకో సీఎం
  • సమస్యల పరిష్కారం చేతకాకపోతే రాజీనామా చేసి పో
  • నేనొచ్చి ఎలా పరిష్కరించాలో చూపిస్తా
  • జగన్ తన గల్లా పెట్టె కోసమే పని చేస్తున్నారు
  • ఆక్వా ఫీడ్ ద్వారా ఏడాదికి రూ.700కోట్లు కాజేయాలని ప్లాన్
  • అక్రమ సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలుకు యత్నం
  • కర్నూలులో నా పర్యటనను చూసే వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చేసింది
  • ఆక్వా రైతులకు 'ఇదేం ఖర్మ' సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక శనిలా దాపురించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం రైతుల సమస్యలపై సదస్సు జరిగింది. 'ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ'పేరుతో జరిగిన ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వాలు చేసిన మేలును వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా కల్చర్ అంతా సంక్షోభంలో ఉందన్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. కానీ ఆయా వర్గాలపై పెత్తనం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రాన్ని ఎంతో మంది పరిపాలించారని..ఉన్న వ్యవస్థలను మెరుగుపరిచారు కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి కారణంగా ఆక్వారైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసే ప్రతి పనిలో తనకేమి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారని.. తన డబ్బు, లాభం చూసుకుని జగన్ తన గల్లా పెట్టె కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కడు పేరుతో తనకు ఆదాయం వచ్చే బటన్ ఎక్కువ నొక్కుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

వ్యవస్థల నాశనమే ఈ రోజు సంక్షోభాలకు కారణం

'తెలుగుదేశం హయాంలో వ్యవసాయంతో పాటు కోస్టల్ ఆంధ్రాలో ఆక్వాను ప్రోత్సహించాం. సముద్రతీరం, నదులు ఉన్న కారణంగా ఆక్వాను ప్రోత్సహించాను. ప్రతి సంవత్సరం 30 శాతం చొప్పున ఆక్వా పెంచాం. రాయలసీమలో నీళ్లు ఇచ్చి రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నం చేశాం. పట్టిసీమ కట్టడం వెనక రాయలసీమ ప్రయోజనాలు ఉన్నాయి. పట్టిసీమ వల్ల ముందుగానే పంటలు వేసుకుని తుఫాన్ల బెడద నుంచి రైతులు బయటపడ్డారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి హార్టికల్చర్ సాగును పెంచాం. ఇప్పుడు హార్టికల్చర్, ఆక్వా కల్చర్ రెండూ దెబ్బతిన్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...వ్యవస్థల నాశనమే ఈ రోజు సంక్షోభాలకు కారణం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

'ఇదేం ఖర్మ కార్యక్రమానికి ఆక్వా రంగం ప్రతి రూపంగా నిలుస్తోంది. ప్రభుత్వ ధన దాహానికి, అసమర్థతకు ఆక్వా రంగం బలైంది. ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. ఆక్వా విషయంలో ఈ ప్రభుత్వానివి అన్నీ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలే. నేను ఏం చేసినా శాసనం అన్నట్లు చేసి రైతులకు ఈ జగన్ రెడ్డి మరణ శాసనం రాశారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి ఏడాది ఆక్వా రంగంలో పురోగతి సాధించాం. దేశంలో 60 నుంచి 70 శాతం వాటా మన రాష్ట్ర ఆక్వా సాధించింది. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఆక్వా ఖర్చులు రెండు రెట్లు పెరిగాయి. ఫీడ్, మందులు, కరెంట్ బిల్లులు సహా అన్నీ పెరిగిపోయాయి. మనం నాడు ఆక్వారంగానికి విద్యుత్ యూనిట్ రూ.2 ఇస్తే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూపాయిన్నరకే ఇస్తాను అన్నాడు. అధికారంలోకి వచ్చాక యూనిట్ రూ.3.85కు పెంచారు.' అని చంద్రబాబు మండిపడ్డారు.

'ప్రభుత్వం ఇస్తున్న యూనిట్ విద్యుత్ రూ.1.50 ధర 20 శాతం మంది రైతులకే వర్తిస్తుంది. స్వార్థ, స్వలాభం లేకుండా సీఎం ఒక్క పని కూడా చేయడం లేదు. మంత్రులు ఆక్వాపై మీటింగ్ పెట్టుకున్న సమయంలో రైతులతో ఎందుకు మాట్లాడలేదు.?. ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే మాకు ఇబ్బందులు లేవని కత్తి మెడపై పెట్టి ఆక్వారైతులతో స్టేట్మెంట్ ఇప్పించారు.' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆక్వా రైతులను భలే కొట్టాడని ఆనందపడుతున్నాడు

'రైతులపై ఎదురుదాడి చేస్తే సమస్య పరిష్కారం కాదు. చేతకాకపోతే రాజీనామా చేసి జగన్ ఇంటికి వెళ్లిపోవాలి. ఎందుకు సమస్యలు పరిష్కారం కావో చూపిస్తాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ఆక్వాలో జోన్ విధానం తీసుకువచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చెరువులకు అనుమతులు లేవని, 10 ఎకరాలు కంటే ఎక్కువ ఉందని సబ్సిడీ ఎత్తివేసి కరెంట్ బిల్లు యూనిట్ రూ.3.85 చేశాడని చంద్రబాబు ఆరోపించారు. ఒక పంట కాలానికి కరెంట్ బిల్లుల రూపంలో రూ.26,862 భారం పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభుత్వం కరెంట్ నిరంతరాయంగా ఇవ్వకపోవడం వల్ల ఎకరానికి డీజిల్ ఖర్చు రూ.70,000 అదనపు భారంగా మారిందన్నారు. 'వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం కోసం అంటూ 0.25% ఉండే సెస్సును అక్వాపై 1 శాతం చేసి నాలుగు రెట్లు పెంచారు. నీటి పన్ను పెంచేశాడు. ఇలాంటి సీఎంను తిక్క సీఎం అనాలా...సైకో సీఎం అనాలా? అని ప్రశ్నించారు. ఆక్వా రైతులు బాధలు పడుతుంటే సీఎం భలే కొట్టాను ఆక్వారైతులను అని చూసి ఆనందిస్తున్నాడు' అని చంద్రబాబు ఆరోపించారు.

మళ్లీ ఓట్లు కొనుగోలు చేసేందుకే..

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించలేదని.. ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటున్నారో తెలుసుకునేందుకే నియమించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టన్నుకు రూ.5వేలు చొప్పున ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారుల నుంచి వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలా వ్యవస్థలను నాశనం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, తద్వారా వచ్చే అక్రమ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. వంద కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకానప్పుడు ఇక త్రి సభ్య కమిటీ ఎందుకు అని చంద్రబాబు నిలదీశారు.

'మంత్రులు ఉప సంఘం కూర్చుని రైతులను ఎలా కంట్రోల్ చేసేలా చూశారు. ఆక్వాలో కీలకమైన అన్ని వ్యవస్థలను నియంత్రించేందుకు సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ తీసుకువచ్చారు. నాడు ఉన్న చట్టాలతోనే ఇబ్బందులు లేకుండా చూశాం. తమ వాటా వసూళ్ల కోసమే కొత్త చట్టాలు. ఒక్క ఫీడ్ ద్వారానే ఏడాదికి రూ.700 కోట్లు అక్రమ ఆదాయానికి పన్నాగం పన్నారు. ఈ అక్రమ సంపాదనతో మళ్లీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు జగన్ సిద్దం అవుతున్నాడు.' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో తన పర్యటనపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనలో చిన్న పిల్లల నుంచి అన్ని వర్గాలు రోడ్డుపైకి వచ్చారని, తన రాజకీయ జీవితంలో చూడని స్పందన కర్నూలులో చూశానన్నారు. కర్నూలు టూర్ చూసి వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చకున్నారని, కొందరు తమకు పదవి వద్దని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan పయనమెటు?



Next Story