- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంకేతికత పెరిగినా తపాలా సేవలే కీలకం.. గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ప్రసంగం
దేశాభివృద్ధిలో, ముఖ్యంగా వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్ లు ముందుండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశాభివృద్ధిలో, ముఖ్యంగా వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)లు ముందుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం చేశారు.
సాంకేతికత పెరిగినా తపాలా సేవలే కీలకం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తపాలా వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికీ ఎంతో నమ్మకం ఉందని కొనియాడారు. ‘ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా, గ్రామీణ స్థాయిలో డాక్ సేవకులు అందించే సేవల ప్రాధాన్యత తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్ర అద్వితీయం’ అని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా పార్శిల్ పంపిణీ సేవల్లో డాక్ సేవక్‌లను భాగస్వామ్యం చేస్తామని ఆయన ప్రకటించారు.
తపాలాశాఖకు ఎయిరిండియా పరిస్థితి రాకూడదు: పెమ్మసాని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తపాలా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. అయితే, శాఖా పరంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తపాలా శాఖ వార్షిక ఖర్చు రూ.35 వేల కోట్లు కాగా, ఆదాయం కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే ఉందని, ఈ లోటును భర్తీ చేసి లాభాల బాట పట్టించాలని అన్నారు. కాలానుగుణంగా మార్పులు చెందుతూ, ఆదాయ వనరులను పెంచుకోకపోతే ఎయిరిండియా తరహా పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
డాక్ సేవక్‌లకు ఈ-స్కూటర్లు: జ్యోతిరాదిత్య సింధియా
గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్ అంటే కేవలం ఉద్యోగి మాత్రమే కాదని, ఒక కుటుంబ సభ్యుడిలా గ్రామస్థులు భావిస్తారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వారి సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తారు. గ్రామీణ డాక్ సేవక్‌ల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విధుల నిర్వహణలో వేగం పెంచేందుకు డాక్ సేవక్‌లకు త్వరలోనే 'ఈ-స్కూటర్లు' అందజేస్తామని హామీ ఇచ్చారు. పార్శిల్, మెయిల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్‌లు పాల్గొన్నారు.






