రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న చీరాల ఇసుక దందా

by Thanuru Gopichand |

గత సంవత్సర కాలంగా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా అడ్డుకోవడంలో బాపట్ల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న చీరాల ఇసుక దందా
X

దిశ ప్రతినిధి, బాపట్ల: గత సంవత్సర కాలంగా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా అడ్డుకోవడంలో బాపట్ల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. రెవిన్యూ, మైనింగ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కు కావడంతో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను సైతం జిల్లా యంత్రాంగం మట్టిలో కలిపేసింది. బాపట్ల-చీరాల మండలాల సరిహద్దు ప్రాంతం ఈపూరుపాలెం పరిధిలోని ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారి 216 కు 100 మీటర్ల దూరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా ఏర్పడిన 50 అడుగుల లోతు గుంటలు ఇటీవల తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. మోటార్లతో నిలిచిన నీరు తోడి మరీ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అటువైపు చూసే సాహసం కూడా చేయడం లేదు. వేటపాలెం మండలంలోని రామాపురం, చల్లారెడ్డిపాలెం, బచ్చులవారిపాలెం, పందిళ్ళపల్లి ప్రాంతాలలో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి పగలు భేదం లేకుండా నిరంతరం కొనసాగుతున్నాయి. వేటపాలెం మండలంలో రైల్వే ట్రాక్ పరిసరాలలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై స్థానిక జనసేన నాయకుడు ఒక మీడియా ఛానల్ కు లైవ్ ఇంటర్వ్యూ ద్వారా బహిర్గతం చేయడం జరిగింది. నిర్మానుష్య ప్రాంతాలలో పేకాట ఆడుతున్న సామాన్యులను డ్రోన్ కెమెరాలతో వేటాడి పట్టుకుంటున్న పోలీసు అధికారులు, ఇసుక అక్రమ తవ్వకాలపై రవాణాపై డ్రోన్ కెమెరాలను ఇప్పటివరకు ప్రయోగించకపోవడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జాతీయ రహదారి వెంబడి ఇటీవల వెలసిన వెంచర్లకు వేలాది ట్రక్కుల ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం చేతులెత్తేయడంతో బహిరంగంగా జరుగుతున్న చీరాల ఇసుక దందా వలన రాష్ట్ర ప్రభుత్వానికి తలవొంపుగా తయారయ్యింది. ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలకు, సామాజిక కార్యకర్తలకు, జర్నలిస్టులకు బెదిరింపులతో పాటు అక్రమ కేసులు, రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వేధింపులకు గురి చేయడం అసాంఘిక శక్తులకు పోలీస్ అధికారుల ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి.

పోలీసులదే కీలక పాత్ర..!

ఇటీవల చల్లారెడ్డి పాలెం పంచాయితీ నాయన పల్లి సర్వే నంబర్ 59/6బి పరిధిలో వాన్ పిక్ భూములలో ఇసుక తవ్వకాల సందర్భంగా వాన్ పిక్ ప్రతినిధులపై చీరాలకు చెందిన ఓ ప్రధాన పార్టీ అధికార ప్రతినిధి అనుచరులు కర్రలతో దాడి చేసిన వ్యవహారంపై వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ వ్యవహారం బహిర్గతం కాకుండా ప్రధాన పార్టీ యువ నాయకుడు ఆదేశాల మేరకు వేటపాలెం ఎస్సై ఆధ్వర్యంలో రాజి కుదిరిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగా పోలీసులు కేసులు కూడా నమోదు చేయకపోవడంతో ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఏర్పడిన ఇసుక దందా వివాదం ఫలితంగా గత డిసెంబర్ 26న తోటవారిపాలెం సమీపంలో ఎంపీ అనుచరుడుకి చెందిన జెసిబి తగలబెట్టిన ఘటనపై చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నెం.323/2024 ను న్యాయస్థానంలో విచారణ వరకు వెళ్లకుండా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజీ కుదిర్చి ఇసుక దందాలో ఇరువర్గాలను ఐక్యం చేయటంలో కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాలో అన్ని తానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నందున ఇటీవల ఇసుక అక్రమ రవాణా దారులు చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శేషగిరిరావు పుట్టినరోజు వేడుకలను సముద్ర తీరంలోని ఆలా రిసార్ట్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వ్యవహారం పై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు మీడియాలో వార్తా కథనాలు కూడా వచ్చాయి. చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గతంలో తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన పులివర్తి వెంకటేష్ అనే కానిస్టేబుల్ ద్వారా పలు ప్రాంతాలలో ఇసుక వనరులు ఉన్న వ్యవసాయ భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

పోలీసులే ఇసుక దందాలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇసుక దందాకు పాల్పడడంపై చీరాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీ యువ నాయకుడు ఆధ్వర్యంలో గుండ్రెడ్డి శివ, ఆవుల అశోక్, గుమ్మడి ఆనంద్ తదితరులను చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమన్వయంతో ఇసుక దందా జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల నియోజకవర్గం పరిధిలో స్ట్రైట్ కట్ కరకట్టలు, అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు, కుందేరు డ్రైవ్ నందు ఇసుక మట్టి అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇసుక అక్రమ రవాణాను కట్టిదిట్టం చేయవలసిందిగా మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశించినప్పటికీ చీరాల నియోజకవర్గంలో ఈరోజు వరకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీస్ అధికారులు చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేయకపోవడం వెనుక, వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇసుక దందా నుండి పెద్ద ఎత్తున నెలసరి ముడుపులు అందుతున్న కారణంగా అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం మోపుతాం : బాపట్ల జిల్లా కలెక్టర్

సంవత్సర కాలంగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో, గత సంవత్సరం జూలై, ఆగస్టు నెలలలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన అప్పటి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామంటూ చేసిన ప్రకటన పేపర్లకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచాలని తీసుకువచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 43 అనుసరించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన సర్కులర్ మెమో 4630/2024, 1700/2024 అమలు చేయడంలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. నిరంతరం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు జిల్లా యంత్రాంగం అసమర్థతను స్పష్టం చేస్తున్నాయి. ఇసుక దందా ఇదే తీరున కొనసాగితే రాబోయే రోజులలో ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే వరద ముంపులకు జరిగే నష్టాలను అంచనా వేయలేమని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story