బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

by Thanuru Gopichand |

జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి

బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
X

దిశ ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, జరిగిన నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం రెండు రోజుల పాటు బాపట్ల జిల్లాలో పర్యటించింది. రెండో రోజైన మంగళవారం చీరాల, వేటపాలెం, కారంచేడు మండలాలో కేంద్ర బృందం పర్యటనను నిర్వహించింది.

ఉదయం చీరాల ఐటిసి గెస్ట్ హౌస్ లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర ప్రభుత్వ బృందంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసుమి బసు, మహేష్ కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగీరథ్ లతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తిలకించారు. అనంతరం తుఫాన్ ప్రభావంతో చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్డులను, రామాపురం గ్రామం, చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్డు నందలి చప్టా, వంతెనలను కేంద్ర ప్రభుత్వ బృందం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. తదుపరి తుఫాన్ ప్రభావంతో కారంచేడు మండల పరిధిలో దెబ్బతిన్న కొమ్మూరు కాల్వను, కప్పుల వాగును, నీట మునిగిన వరి పంటను, కారంచేడు స్వర్ణ రోడ్ లో దెబ్బతిన్న పంటపొలాలు, డ్యామేజ్ అయిన పర్చూరు రోడ్డు కేంద్ర ప్రభుత్వ బృందం సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Next Story