గుంటూరు జిల్లా టీడీపీలో ముసలం

by Disha Web |
గుంటూరు జిల్లా టీడీపీలో ముసలం
X

దిశ, ఏపీ బ్యూరో: మాకేం రాజకీయాలు తెలీదా! మేమేమన్నా కొత్తగా వచ్చామా! ఎక్కడో కడపోళ్లు వచ్చి ఇక్కడ పోటీ చేయడమేంటీ! వాళ్లు పోటీ చేస్తే ఓడించి తీరుతామంటూ మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. నరసరావుపేట ఎంపీ సీటు పుట్టా మహేశ్‌‌కు ఖాయమనే దానిపై రాయపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అంశంపై టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో తాను పాల్గొనని చెప్పారు. తన వారసుడు రంగారావుకు సీటు ఇవ్వాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. నరసరావుపేట ఎంపీ లేదా ఎమ్మెల్యే, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తన వారసుడికి ఇవ్వాలని చంద్రబాబును అడిగినట్లు తెలిపారు.

గుంటూరు పశ్చిమకు.. రేసులో నలుగురు

ప్రస్తుతం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావు‌పేటలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవడం ఇన్‌ఛార్జి అరవిందబాబు వల్ల కాదని పార్టీలో వినిపిస్తోంది. ఇక్కడ అభ్యర్థిని ఎలాగూ మారుస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక సత్తెనపల్లిలో ఇన్‌ఛార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఇక్కడ కోడెల శివరాం, చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై చంద్రబాబు ఇంకా తేల్చలేదు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి నలుగురు పోటీపడుతున్నారు. కోవెలమూడి రవీంద్ర, భాష్యం ప్రవీణ్, మన్నవ మోహనకృష్ణతో పాటు బీసీల నుంచి డాక్టర్ శేషయ్య ఈ సీటును ఆశిస్తున్నారు. అందుకే రాయపాటి తన కుమారుడికి నరసరావు పేట ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇవ్వాలని కోరుతున్నారు.

స్పందించని అధిష్ఠానం

ఈ పాటికే పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్‌కు నరసరావుపేట ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు గ్రీన్​సిగ్నల్​ఇచ్చినట్లు సమాచారం. అయితే పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ ఇన్‌ఛార్జిలు మహేశ్ అభ్యర్థిత్వం పట్ల స్పందించలేదని తెలుస్తోంది. దీని వెనుక రాయపాటి చక్రం తిప్పి ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది.

ఇప్పుడైనా రాయపాటి వారసుడికి సీటు ఎక్కడో తేల్చకుంటే నరసరావు పేట ఎంపీ సీటు మహేశ్ యాదవ్‌కు ఇచ్చినా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లోకేశ్​ పాదయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమైన చంద్రబాబు రాయపాటి వ్యాఖ్యలపై స్పందించలేదు.

Also Read...

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీఈఓ లేఖ..


Next Story