దిత్వా' తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తత: అధికారులకు ఆదేశాలు

by Thanuru Gopichand |

దిత్వా తుఫాను (Ditwah Cyclone) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తత: అధికారులకు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుఫాను (Ditwah Cyclone) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంచార్జి మంత్రులు తమ జిల్లాలో తుఫాను కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించారు. హోం మంత్రి అనిత వంగలపూడి స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల అధికారులను సమన్వయపరుస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులతో పాటు అధికారులను ఆదేశించారు.

తీరం వైపు 'దిత్వా'

​నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'దిత్వా' తుఫాను గంటకు 10 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో కదుతోంది. ఈ నెల 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను ఇప్పటికే శ్రీలంకలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

ముందస్తు చర్యలపై సమీక్ష

​ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలపై 'దిత్వా' ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ముందస్తు జాగ్రత్త చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను వల్ల విద్యుత్ వ్యవస్థకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, తక్షణం పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

​ప్రజల తరలింపు

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు, జిల్లాల ఇంచార్జి మంత్రులకు ఇప్పటికే సూచించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పూర్తి సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.

Next Story