గేమ్ ఛేంజర్‌గా గూగుల్ డేటా సెంటర్.. USA-2.0 పర్యటనకు మంత్రి లోకేశ్ రెడీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 05:41:43  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐలతో సంబంధాలను బలపరుచుకోవడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేశ్ USA-2.0 టూర్‌కు సన్నద్ధమవుతున్నారు.

గేమ్ ఛేంజర్‌గా గూగుల్ డేటా సెంటర్.. USA-2.0 పర్యటనకు మంత్రి లోకేశ్ రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐలతో సంబంధాలను బలపరుచుకోవడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేశ్ USA-2.0 టూర్‌కు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 6న మంత్రి లోకేశ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి డలస్‌కు చేరుకుంటారు. అక్కడ ఎన్ఆర్ఐలతో ప్రాథమిక భేటీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 7న టెక్సాస్‌లోని గార్లాండ్ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆ మీటింగ్‌లో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. సుమారు 8 వేల మంది ఎన్ఆర్ఐలు ఆ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక డిసెంబర్ 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీల సీనియర్ అధికారులతో రెండు రోజుల వ్యవధిలో మంత్రి లోకేశ్ వరుసగా భేటీ అవుతారు. ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు వారితో చర్చలు జరపునున్నారు.

గత పర్యటనలో అద్భుత విజయాలు..

మంత్రి నారా లోకేష్ గత అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు చేపట్టిన అమెరికా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచింది. ‘బ్రాండ్ ఏపీ’ని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల పర్యటలో పర్యటనలో లోకేష్ 100కి పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి, రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఫలితంగా, ఐటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), రెన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ వంటి రంగాల్లో రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశారు. జనవరి 2025లో డేవోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌లో భారీ ఎమ్ఓయూలు (MoUs) ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదరిన విషయం తెలిసిందే.

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కీలకం..

విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఇటీవలే కూటమి సర్కార్ కీలక అడుగు వేసింది. సుమారు 10 బిలియన్‌ డాలర్ల (రూ.88,628 కోట్ల) పెట్టుబడితో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్.. 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ‘గూగుల్‌ ఏఐ హబ్‌’ పేరుతో భారత్‌లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028- 2032 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 1,88,220 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అక్టోబర్‌ 14న రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్, ఇతర గూగుల్‌ ఉన్నత స్థాయి ప్రతినిధులు ఆ ఎంవోయూపై సంతకాలు చేశారు. అయితే, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతుండటంతో తాజాగా, నారా లోకేశ్ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story