అసంతృప్తులకు గుడ్ న్యూస్.. Y. S. Jagan Mohan Reddy వ్యుహామిదే!

by Disha Web Desk 4 |
అసంతృప్తులకు గుడ్ న్యూస్.. Y. S. Jagan Mohan Reddy వ్యుహామిదే!
X

'సమస్యలను పరిష్కరించకున్నా పర్లేదు. వాటిని పదే పదే వల్లె వేస్తే చాలు. అదే పెద్ద ప్రచారం. చేయని వాటి గురించి ప్రస్తావించక్కర్లేదు. చేసిన వాటిని ఒకటికి పదిసార్లు చెబితే సరి. జనం నోళ్లలో నానుతుంటుంది. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది ?' అంటూ ఒంగోలుకు చెందిన ఓ సీనియర్​ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైసీపీ ఎత్తుగడలు కూడా అలాంటివేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికార వైసీపీ అనుసరిస్తున్న వ్యూహానికి ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని నిరంతరం జల్లెడ పట్టేట్లు ఎన్నికల సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్​ఏం చేయబోతున్నారనేది పసిగట్టలేక ప్రతిపక్షాలు కిందామీదా పడుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో:

బ్యాక్​బోన్​క్లాస్‌గా చెబుతున్న బీసీలకు వైసీపీ సర్కారు గత మూడున్నరేళ్లలో పెద్దగా విరగబొడిచిందేమీ లేదు. సుమారు 2.14 కోట్ల వెనుకబడిన జనాభాలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమందికి స్వయం ఉపాధి కల్పించారు? ఎన్ని కుటుంబాలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకొచ్చారు? ఎన్ని కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించారు? ఇంకెన్ని కులాలకు కీలక పదవులు కట్టబెట్టారని పరిశీలిస్తే.. పెద్దగా చెప్పుకోదగ్గవి ఏవీ కనిపించవు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని మొదలు పెట్టి ఊరుమ్మడి పథకాల్లో వీళ్లకు కలిగిన లబ్ది ఎంతో చెప్పేస్తే చాలు. దానిపైనే బడుగు జనం చర్చించుకుంటూ ఉంటారనేది వైసీపీ నేతల ఎత్తుగడని సర్వత్రా వ్యక్తమవుతోంది.

సర్పంచులు, వార్డు సభ్యుల ఆక్రోశం

ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఆక్రోశం అంతా ఇంతా కాదు. నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచారు. వీళ్లు కూడా తీవ్ర నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వీళ్లు ఏమేరకు సహకరిస్తారనేది పక్కన పెట్టి పార్టీలో కొత్త పదవులు సృష్టించారు. ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున పార్టీ వలంటీర్లను నియమిస్తున్నారు. అందులో ఒక మహిళ ఉంటారు. ఇలా మొత్తం 5.2 లక్షల మంది కార్యకర్తలను వలంటీర్లుగా ఏర్పాటు చేస్తారు. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమిస్తారు. అందులో ఒక మహిళ ఉంటారు. మొత్తం నెల రోజుల్లో ఈ సైన్యాన్ని ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు గడప గడపకూ వెళ్తున్నట్లే వీళ్లు కూడా వెళ్తారు. ఏ కుటుంబం ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదో గుర్తిస్తారు. వాళ్లను ఏదో విధంగా అధికార పార్టీకి మళ్లీ ఓటు వేసేట్లు చర్యలు తీసుకుంటారు. ఇప్పటిదాకా తమను గుర్తించడం లేదనే ఆక్రోశంలో ఉన్న కార్యకర్తలందరికీ చేతినిండా పని కల్పిస్తారు. అధికారానికి వచ్చినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని అలిగిన వాళ్లందర్నీ భుజంపై చెయ్యేసి దగ్గరకు తీసుకుంటారు. ఇంతకీ వీళ్లకు ఏం లబ్ది చేకూరుస్తారనేది మాత్రం బయటకు వెల్లడించడం లేదు.

భవిష్యత్తును ఊహించే..

ఎన్నికల విధుల్లో వలంటీర్లు ఉండకూడదని పదేపదే ఎన్నికల సంఘం ఆదేశాలిస్తోంది. ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా వ్యవహరిస్తున్న వలంటీర్లను పక్కన పెడితే ఇబ్బందులు తలెత్తవచ్చని ఊహించినట్లుంది. అత్తెసరు వేతనమిచ్చి ఇన్నాళ్లూ తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ వలంటీర్లు అడ్డం తిరిగినా అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కోవడం కష్టం. ఇవన్నీ ఊహించే వైసీపీ ఎన్నికల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీళ్లందరికీ ఉచి త బీమా సౌకర్యం కల్పిస్తూ పార్టీ విస్తృత సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారట. దీంతో వాళ్లకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. అయినా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థంగాక ప్రతిపక్షాలు జుట్టు పీక్కుంటున్నాయి. ఇప్పటిదాకా గాలికొదిలేసి అకస్మాత్తుగా తమపై ప్రేమ ఒలకబోస్తున్న పార్టీ నాయకత్వం తీరుపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది...

ఇవి కూడా చదవండి :

1.ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది.. Minister Bosta సంచలన వ్యాఖ్యలు

2.ఏడున్నర గంటలు ఏం ప్రశ్నించారు.. కేసీఆర్‌కు వివరించిన Kavitha !

Next Story

Most Viewed