ఉగ్ర ‘గోదారి’.. ప్రమాద హెచ్చరిక జారీ

by srinivas |
ఉగ్ర ‘గోదారి’.. ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఒక పక్క కొండవాగుల బీభత్సం కొనసాగుతుండగా, మరోవైపు గోదావరి వరద ఉధృత రూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజక్ట్ స్పిల్ వే వద్ద శనివారం సాయంత్రం వరకు 22-25 మీటర్లు మధ్య వున్న నీటిమట్టం ఆకస్మికంగా పెరిగిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నాటికి స్పిల్వే దిగువన 31.900 మీటర్ల వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్పిల్ వేకు ఉన్న 48 గేట్ల ద్వారా దిగువకు 8,37,179 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు .

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 3 గంటలకు 40.80 అడుగులుంది. ఈ నీటిమట్టం సాయంత్రం 4 గంటలకు 41.30 అడుగులకు చేరుకుంది. 5 గంటలకు 41.90 అడుగులకు చేరింది. అంటే గంటకు సుమారు ఒక మీటరు చొప్పున వరద నీరు పెరిగినట్టైంది. ప్రస్తుతం సాయంత్రం 6 గంటలకు 43 అడుగుల నీటి మట్టం నమోదు అయింది. దీంతో అధికారులు మొదటి హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

నిండుకుండలా రిజర్వాయర్లు

పోలవరం మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు, రిజర్వాయర్లు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం ఉదయం మండలంలో భారీ వర్షం కురిసింది. గుంజవరం, పేడ్రాల కాలువలు, కొండవాగులు పొంగి గుంజవరం కల్వర్టుపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. లక్ష్మీనారాయణ దేవి పేట (ఎల్ఎన్ డి పేట) రిజర్వాయర్‌కి కొండవాగుల వరద వచ్చి చేరడంతో రిజర్వాయర్ నిండింది. ఎల్ఎన్ డిపేట రిజర్వాయర్ సామర్థ్యం 90.05 టిఎంసిలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో 88.10 టీఎంసీల నీటిమట్టం నమోదయ్యింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అదే నీటిమట్టాన్ని నిర్వహిస్తూ 3 స్లూయిజ్ గేట్లకు గాను ఒక్క గేటుని పది సెంటీమీటర్లు పైకి ఎత్తి 330 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు ఏఈ కొండలరావు తెలిపారు. కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కొవ్వాడ కాలువలోకి వరద చేరి పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటిమట్టం కడమ్మ స్లూయిజ్ గేట్లకు సమాంతరంగా ఉండడంతో కొండవాగుల వరద గోదావరిలోకి వెళ్లే వీలులేక ఎగదన్ని పంటపొలాలు నీటమునిగాయి.

Next Story

Most Viewed