గ్యాస్ సెగ: హోటళ్లపై ‘కమర్షియల్’ దెబ్బ.. విశాఖలో తీవ్ర కొరత!

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన కొరత ఇప్పుడు హోటల్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది.

గ్యాస్ సెగ: హోటళ్లపై ‘కమర్షియల్’ దెబ్బ.. విశాఖలో తీవ్ర కొరత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన కొరత ఇప్పుడు హోటల్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. పెట్రోలియం కంపెనీలు డీలర్లకు సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో హోటల్ యజమానులు లబోదిబోమంటున్నారు. విశాఖ నగరంలో హోటళ్ల అవసరాలకు నెలకు సుమారు 70 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరం కాగా, ప్రస్తుతం కేవలం 12 వేల సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే అవసరంలో 20 శాతం కూడా సరఫరా కాకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. రేపటి నుంచి ఈ సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ హల్చల్

గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్నారని, దీనివల్ల నిర్వహణ ఖర్చులు భారమవుతున్నాయని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో చిన్న తరహా హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లోనూ హోటళ్లు మూసివేయక తప్పదని యజమానులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి గ్యాస్ కొరత తీర్చాలని కోరుతున్నారు.

తెలంగాణలో ‘బంద్’ హెచ్చరిక

మరోవైపు తెలంగాణలోనూ గ్యాస్ సెగలు రాజుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోతే, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్‌కు పిలుపునిస్తాం.’ అని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story