ఏఐ అంటేనే భయమేస్తోంది : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by Naga Rani Yarlagadda |

ఏఐతో భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు పోయేప్రమాదం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఏఐ అంటేనే భయమేస్తోంది : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా మానవ సంబంధాలు మంటగలిసి పోతాయోమోనని భయమేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ అనే మాట వింటేనే వణుకుపుడుతోందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తనకు కృత్రిమ మేథస్సు లేదన్నారు. ఏఐ ఉండకూడదని తాను చెప్పను కానీ.. దానివల్ల వైట్ కాలర్ జాబ్స్ పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలువలతో కూడిన కృత్రిమ మేథస్సును అందించాలని సూచించారు. భవిష్యత్తులో అనేక రంగాల్లో చాలా ఉద్యోగాలు పోతాయని, దీనిగురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాల్లో బూతులు మాట్లాడేవారిని ప్రోత్సహించకూడదు

అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలను మనం మన భావితరాలకు అందించాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని , మన కట్టు.. బొట్టులకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కులం కన్నా గుణం మిన్న అని పెద్దలు ఊరికే చెప్పలేదని, డిగ్రీల కంటే పరిజ్ఞానమే ముఖ్యమన్నారు. ఇక రాజకీయాల్లో బూతులు మాట్లాడే వ్యక్తుల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదన్నారు. అలాంటివారిని సమాజం బహిష్కరించాలని హితవుపలికారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, గూగుల్, రీల్స్ కు ప్రాధాన్యం తగ్గించి మంచి సమాజ నిర్మాణానికై మనమంతా కృషి చేయాలని పేర్కొన్నారు.

Next Story