Chandrababu Naidu: బొజ్జల మృతి టీడీపీకి తీరని లోటు: చంద్రబాబు సంతాపం

by Vinod kumar |   (  Updated:2022-05-06 11:19:13  IST  )

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో తీరని విషాదం - Chandrababu Naidu Condolence on Bojjala Gopala Krishna Reddy death

Chandrababu Naidu: బొజ్జల మృతి టీడీపీకి తీరని లోటు: చంద్రబాబు సంతాపం
X

Chandrababu Naidu Condolence on Bojjala Gopala Krishna Reddy death

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో తీరని విషాదం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే శుక్రవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇటీవలే బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు 73వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇకపోతే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949 ఏప్రిల్ 15న జన్మించారు. ఆయన తండ్రి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సుబ్బరామి రెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1989–1994, 1994–1999, 1999–2004, 2009–2014, 2014-2019 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రజలకు సేవ అందించారు. 1999-2004లో ఐటీ, ఆర్‌అండ్‌బీ మంత్రిగా, 2014లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పనిచేసిన సంగతి తెలిసిందే.

బొజ్జల మృతి టీడీపీకి తీరని లోటు : చంద్రబాబు సంతాపం

'తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరం. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా' అని చంద్రబాబు తన సంతాపం తెలిపారు.



Next Story