Undavalli : వైసీపీ గూటికి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-09 06:24:35  IST  )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ముఖ్య నాయకుడిగా, ఎంపీగా ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunkumar)వైసీపీ పార్టీ(Joining YSRCP)లో చేరబోతున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Undavalli : వైసీపీ గూటికి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ముఖ్య నాయకుడిగా, ఎంపీగా ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunkumar)వైసీపీ పార్టీ(Joining YSRCP)లో చేరబోతున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఉండవల్లి ఈ నెల 26న వైసీపీలో చేరతార‌ని.. ప‌దేళ్ల క్రిత‌మే రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న ఉండ‌వ‌ల్లి మళ్లీ వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇటీవ‌ల వైసీపీలో చేరిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శైల‌జానాథ్‌ బాటలోనే ఉండవల్లి కూడా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఎదిగిన ఉండవల్లి 2004, 2009ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించి 14 వ, 15వ లోక్‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని యజమాని రామోజీరావులకు వ్యతిరేకంగా చేసిన విమర్శలు, వేసిన కేసులతో ఉండవల్లి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే 2009 సెప్టెంబర్ లో వైఎస్సాఆర్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం..తాను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర విభజన జరిగిపోవడంతో 2014ఎన్నికలకూ దూరంగా ఉండిపోవడంతో పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

అయితే తరుచు రాష్ట్ర విభజన సమస్యలపైన తన వైఖరులను వినిపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం..లేఖలు రాయడం కొనసాగిస్తున్నారు. అలాగే మార్గదర్శికి వ్యతికేరంగా వేసిన కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసును ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. పదేళ్ల పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి ప్రతిపక్ష వైసీపీలో చేరితే ఆయన నాయకత్వ, మేధో ప్రతిభ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కష్టకాలంలో మేలుచేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story