పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉంది: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టిన మాజీ మంత్రి.

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉంది: మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీలో చేరికపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడటానికి కారణాలను వివరిస్తూనే, తన మనసులోని ఒక ప్రత్యేక కోరికను బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ చేసిన తప్పిదాలను తాను ఎప్పటికప్పుడు ప్రశ్నించానని బాలినేని గుర్తు చేసుకున్నారు. "వైసీపీలో ఉన్న సమయంలో తప్పులను ఎత్తి చూపినందుకే నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి నా మంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉన్న పరిస్థితుల్లో జనసేన మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని భావించి ఆ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. జనసేనలో చేరే సమయంలోనే పవన్ కల్యాణ్‌కు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పానని బాలినేని తెలిపారు. "నాకు ఎలాంటి పదవులు వద్దు. కేవలం పార్టీ కోసం పనిచేస్తానని పవన్‌కి క్లియర్‌గా చెప్పాను. ప్రశ్నించే గుణం ఉన్న పార్టీలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, జనసేన అలాంటి పార్టీయే" అని ఆయన కొనియాడారు.

పవన్‌తో సినిమా చేయాలని ఉంది..

రాజకీయాల సంగతి పక్కన పెడితే, పవన్ కల్యాణ్‌తో తనకు ఒక సినిమా చేయాలని ఉందని బాలినేని తన ఆకాంక్షను వెల్లడించారు. "పవన్ కల్యాణ్‌ అవకాశం ఇస్తే, ఆయనతో సినిమా నిర్మించి నా కోరిక తీర్చుకుంటాను" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

Next Story