‘ఉప ఎన్నికలను రద్దు చేయాలి’.. మాజీ సీఎం జగన్ సంచలన డిమాండ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-12 15:42:05  IST  )

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

‘ఉప ఎన్నికలను రద్దు చేయాలి’.. మాజీ సీఎం జగన్ సంచలన డిమాండ్
X

దిశ,వెబ్‌డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈరోజు జరిగిన ఉప ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సీట్లను సీఎం చంద్రబాబు నాయుడు గుండా మాదిరిగా హైజాక్ చేశారని ఆరోపించారు. అధికారన్ని దుర్వినియోగం చేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించాలని మాజీ సీఎం జగన్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టి మాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్‌ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానమని గుర్తుచేశారు. కానీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్‌ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయాలకు నాంది పడింది అని విమర్శించారు.

ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారని మండిపడ్డారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు సీఎం చంద్రబాబు తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్‌, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారని వైఎస్ జగన్ ఆరోపించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం? అని మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Next Story