అది డైవర్ట్ చేసేందుకే ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి..జగన్ సంచలన ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-09 04:10:45  IST  )

వైసీపీ నేత ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. చంద్రబాబు పాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని విమర్శించారు.

అది డైవర్ట్ చేసేందుకే ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి..జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. చంద్రబాబు పాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని విమర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండమని అభిప్రాయపడ్డారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా తన పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు. దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరని హెచ్చరించారు.

Next Story