కల్తీపాల ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా పాలకేంద్రాల్లో తనిఖీలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-25 06:16:50  IST  )

రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలు పాలకేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

కల్తీపాల ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా పాలకేంద్రాల్లో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో కల్తీపాలు తాగి పదులసంఖ్య ప్రజలు ఆస్పత్రుల పాలవ్వడం, నలుగురు మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడే బాధితుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు అధికారులు, జిల్లా కలెక్టర్ కల్తీపాల ఘటనపై సర్వే నిర్వహిస్తున్నారు. వివిధ కేంద్రాల నుంచి పాలనమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ప్రస్తుతం వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 15 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. బాధితులకు విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతోంది. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో మరోసారి వివరాలను సేకరిస్తున్నారు. రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో వైద్యశిబిరం కొనసాగుతోంది.

మరో బాధితుడు మృతి

కల్తీపాలు తాగి అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన బాధితుల్లో మరోవ్యక్తి మరణించినట్లు కేజీహెచ్ డాక్టర్లు ప్రకటించారు. బాధితుడు మనోహర్.. అనారోగ్యంతో కాకినాడలోని కేజీహెచ్ లో చేరాడు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు ఫిబ్రవరి 18న విశాఖ కేజీహెచ్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మనోహర్ కిడ్నీ, రక్తహీనత సమస్యలతో ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు కూడా నిన్న మరణించడంతో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు సమాచారం.

రాజమండ్రి కల్తీపాల ఘటనలో పలువురు చనిపోవడంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అలర్టయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న పాలకేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతపురంలో మూడు ప్రాంతాల్లో విజిలెన్స్ ఆహార తనిఖీ విభాగం అధికారులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. అనంతపురం శ్రీకంఠం కూడలి కల్యాణదుర్గం బైపాస్ రామ్ నగర్లో తనిఖీలు నిర్వహించారు. ఆహార తనిఖీ అధికారులు ప్రైవేట్ వ్యాపారుల నుంచి పాల నమూనాలను సేకరిస్తున్నారు. మరోవైపు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో ఉన్న పాలకేంద్రాల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లలో ఉన్న పాలకేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. పాల నమూనాలను సేకరించి ల్యాబులకు పంపారు. MRP, తయారీతేదీలు లేకుండా చాలాకాలంగా ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన బాదంపాల ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Next Story