సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు.. ఐదుగురి ఆచూకీ లభ్యం, ఇద్దరి కోసం గాలింపు!

by Ramesh Naini |

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం.

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు.. ఐదుగురి ఆచూకీ లభ్యం, ఇద్దరి కోసం గాలింపు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో ఒకరైన బోటు యజమాని కారె చిన్నాను ఓ వాణిజ్య నౌక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు తెలిసింది. అయితే, ఆ సమయంలో చిన్నాతో పాటే ఉన్న మరో నలుగురు మత్స్యకారులు నౌక ఎక్కలేకపోవడంతో, వారిని రక్షించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆచూకీ ఇంకా తెలియని మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆందోళన రేపిన కమ్యూనికేషన్ గ్యాప్..

ఈ నెల 1న విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగమయ్యపాలెం మరియు విశాఖకు చెందిన మొత్తం ఏడుగురు మత్స్యకారులు విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. శనివారం సాయంత్రానికి వీరు ఒడ్డుకు చేరుకోవాల్సి ఉండగా, సాయంత్రం 4 గంటల తర్వాత వారి ఫోన్లు పనిచేయకపోవడం, వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

హోంమంత్రి భరోసా..

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారుల నుంచి ఆరా తీసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి.. గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ కష్టకాలంలో మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చినట్లు వెల్లడించాయి.

Next Story