పంటంతా వరదార్పణం.. కౌలురైతు ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పంటంతా వరదనీటిలో మునిగిపోవడంతో రైతు మనస్తాపం చెందాడు.

పంటంతా వరదార్పణం.. కౌలురైతు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నారువేసి, ఊడుపు ఊడ్చిన పంటచేలన్నీ నీట మునిగాయి. నదులకు వరద తాకిడి పెరగడంతో.. కాలువల్లోనూ నీటి ప్రవాహం పెరిగి పంట పొలాల్లోకి వరదనీరు చేరింది. నారువేసిన పంట నీటమునగడంతో పెట్టుబడంతా వరదార్పణం అయిందని రైతన్నలు వాపోతున్నారు. పంట నీటమునగడంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతర్లంకలో చోటుచేసుకుంది.

ఈడుపుగంటి మురళీకృష్ణ (40) అనే రైతు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. సాగు ఖర్చులకోసం బ్యాంకు రుణాలతో పాటు.. గ్రామస్తుల వద్ద కూడా అప్పు చేశాడు. పంట చేతికి వస్తే అప్పులన్నీ తీర్చేయొచ్చని చూస్తున్న వేళ.. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు పంట నీటమునిగింది. దీంతో మనస్తాపానికి గురైన మురళీ కృష్ణ వారంరోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. ఆరోగ్యం విషమించడంతో శనివారం మరణించాడు. కుటుంబ పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.

Next Story