ఉపాధి హామీ బకాయిలు రూ.122 కోట్లు : ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం ఆన్సర్

by Disha Web Desk 21 |
ఉపాధి హామీ బకాయిలు రూ.122 కోట్లు : ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం ఆన్సర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతన కాంపోనెంట్ కింద ఈ ఏడాది డిసెంబర్1 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ. 122.75 కోట్లు మాత్రమే ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రూ.1019 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె వివరించారు. ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేయడమన్నది నిరంతర ప్రక్రియ. క్షేత్రస్థాయిలో పని డిమాండ్‌ను బట్టి వాటికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు రూ.60వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనంగా మరో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నిధులు ఆశిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల్లో డిబిటి ద్వారా ఉపాధి వేతన చెల్లింపులు

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉపాధి వేతనదార్లకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) విధానంలో వేతనాలు చెల్లించేందుకు ఎన్ఈఎఫ్ఎంఎస్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టం)ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవర్ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా ఉపాధి వేతనదార్లకు వెసులుబాటు కల్పించేందుకు డీబీటీ విధానంలో నేరుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వేతనదార్లు తమ వెసులుబాటును బట్టి బ్యాంకులు, ఏటీఎం, బిజినెస్ కరెస్పాండెంట్స్ నెట్‌వర్క్‌ల ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అమలు చేస్తున్న ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌, పోస్ట్- మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు కూడా డీబీటీ విధానంలో నేరుగా గిరిజన విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవర్ తెలిపారు.

Next Story

Most Viewed