చినుకు పడితే చిత్తడే.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేదెలా!

by Jakkula.Mamatha |

అల్లవరం మండల కేంద్రంలో దాదాపు కార్యాలయాలన్నీ అక్కడే ఉన్నాయి.

చినుకు పడితే చిత్తడే.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేదెలా!
X

దిశ, అల్లవరం: అల్లవరం మండల కేంద్రంలో దాదాపు కార్యాలయాలన్నీ అక్కడే ఉన్నాయి. అన్నిటికంటే పేదలకు వైద్యసేవలు పొందే 30 పడకల ఆసుపత్రి అక్కడే ఉంది. అల్లవరం ప్రధాన రోడ్డు మార్గం నుంచి ఈ ఆసుపత్రి, తహసీల్దార్‌ తదితర కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 200 మీటర్లు దూరం మరో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. మండల ప్రజలు ఇక్కడే అసలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఇక్కడికి పదుల సంఖ్యలో రాకపోకలు సాగించే సామాన్య ప్రజలే కాదు.

ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది కూడా ఇటువైపుగా వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. సుధీర్ఘకాలం క్రితం వేసిన రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ఇప్పుడు చినుకు పడితే చాలు చిత్తడిగా మారి ఆపై బురద మయంగా తయారవుతోంది. దీంతో నడిచి వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు అయితే జర్రున జారి పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ కూడా శనివారం ఇదే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

పదేళ్ల క్రితం నిర్మించిన రోడ్డే దిక్కు..

అల్లవరం ఆసుపత్రి, తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లే ఈరోడ్డును పదేళ్ల క్రితం మెటల్‌ రోడ్డుగా వేశారు. ఆ తర్వాత ఇటువైపుగా ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఈ రోడ్డు అత్యంత దారుణంగా మారింది. చిన్నపాటి వర్షం వస్తే చాలు బురదతో నిండిపోయి జారిపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన గత ప్రభుత్వ సమయంలో పలు సార్లు ప్రతిపాదనలు చేసిన నిధులు వెచ్చించక ఒక్క అడుగు ముందుకు పడలేదు..కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే ఈ రోడ్డు అంచనాలు రూపొందించారు. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.

తాత్కాలికంగానైనా చర్యలు కరవు..

కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలున్న ఈ రోడ్డు మార్గం వర్షాకాలంలో మరింత దారుణంగా మారుతుందని కార్యాలయాల సిబ్బంది, ప్రజలు వాపోతున్నారు. శాస్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మించే వరకు అయినా తాత్కాలికంగానైనా గ్రావెల్‌ వేసి బురద నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు తప్పించాలని కోరుతున్నారు. అయితే దీనిపై అధికారులను వివరణ కోరగా రోడ్డు అంచనాలు సిద్ధం అయ్యాయని, త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతారని చెబుతున్నారు.

Next Story