కడియం నర్సరీలకు నిరంతర విద్యుత్ అందించాం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-25 08:46:39  IST  )

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడియం నర్సరీలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించామని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు.

కడియం నర్సరీలకు నిరంతర విద్యుత్ అందించాం
X

దిశ, వెబ్ డెస్క్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడియం నర్సరీలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించామని ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో జరిగిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీ గ్రామ ఇంచార్జి సంగీత వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కడియం మండలం నర్సరీల ద్వారా దేశమంతా ఖ్యాతి గడించిందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్లే అది సాకారమైందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పగలు నాలుగు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున కేవలం ఏడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా వైయస్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగిందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసిన నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు. ఆ కష్టాలను తొలగించి కన్నీటిని తుడిచేలా పాలన సాగించిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు. పేదవాడు పస్తులతో ఉండకూడదని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం లబ్ధి చేకూర్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఒక్క వైయస్ జగన్ అన్నారు.

Next Story