- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో గురువారం ఇటుక లోడుతో ఉన్న ఐసర్ వ్యాన్ - పాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు

దిశ, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో గురువారం ఇటుక లోడుతో ఉన్న ఐసర్ వ్యాన్ - పాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోకరుతీవ్ర గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వవరాల ప్రకారం.. పిఠాపురం మండలం మల్లాం గ్రామానికి చెందిన కాల్దారి రాజుబాబు(40), గాలింక కన్నబాబు(43), విరవ గ్రామానికి చెందిన గుద్దాటి చినబాబు మృతిచెందారు. మల్లాం గ్రామానికి చెందిన కాల్దారి రమేష్(43) తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పిఠాపురం మండలం మల్లాం నుండి విరవ ఆటోలో వస్తుండగా విరవ గ్రామం ఆంజనేయస్వామి ఆలయం వద్ద మలుపు తిరిగిన వెంటనే కొద్ది దూరంలో ఇటుకలోడుతో ఉన్న ఐసర్ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో రాజుబాబు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ కన్నబాబును కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గ మధ్యలో మృతి చెందగా, విరవ గ్రామానికి చెందిన గుద్దాటి చిన్నబాబు చికిత్స పొందుతూ కొద్ది గంటల్లోనే చనిపోయాడు. గాయపడ్డ రమేష్ కు చికిత్స అందిస్తున్నారు.ప్రమాద ఘటనపై పిఠాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన గాలింక కన్నబాబు, గాయపడ్డ కాల్దారి రమేష్‌లు హైదరబాద్‌లో కూలి పని చేసుకుంటున్నారు. తల్లికి వందనం డబ్బుల కోసం ఇటీవల స్వగ్రామం మల్లాం వచ్చారు. స్వగ్రామంలో ఓ వేడుకలో అప్పటి వరకూ బంధువులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వీరు, కొద్ది సేపటికే జరిగిన అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో వారి ఇంట విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన ఉపాదిపథకం ఫీల్డ్ అసిస్టెంట్ మైనపాటి అప్పారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సామర్లకోట నుండి స్వగ్రామం కుమారపురం వచ్చే క్రమంలో కోదండరామపురం గ్రామం వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సామర్లకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ విచారం
పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారని తెలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆటో, వ్యాన్ ఢీ కొన్న ప్రమాదం పై జిల్లా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి, ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించడంలో తగిన విధంగా సమన్వయం చేసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.






