Theft: పగలు ప్రజా సేవ.. రాత్రి చోరీలు... రికవరీలో భారీ ట్విస్ట్

by Disha Web Desk 16 |
Theft: పగలు ప్రజా సేవ.. రాత్రి చోరీలు... రికవరీలో భారీ ట్విస్ట్
X

దిశ‌, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌రిగిన దొంగ‌త‌నం సంచ‌ల‌నం సృష్టించింది. పిఠాపురంలో వ‌లంటీర్‌ డి.మ‌ణికంఠస్వామి ఓ దుకాణంలో దొంగ‌త‌నం చేసి దొరికిపోయాడు. పిఠాపురం మార్కెట్ ప్రాంతంలో శ్రీను అనే వ్యక్తి దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న దుకాణంలో ఉన్న గ‌ల్లా పెట్టెను డి.మ‌ణికంఠస్వామి ఎత్తుకుపోయారు. షాపు య‌జ‌మాని శ్రీను త‌మ కుటుంబీకుల‌కు ఇవ్వడానికి తెచ్చిన సొమ్ము షాపు గల్లాపెట్టెలో పెట్టి తాళాలు వేశారు. అయితే గ‌ల్లా పెట్టె మాయం కావ‌డంతో కంగుతిన్నాడు. షాపు తాళాలు వేసిన‌ట్టే వేసి ఉన్నాయి. కాని లోప‌ల గ‌ల్లా పెట్టె లేక‌పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్రయించారు. విచార‌ణ చేసిన పోలీసులు నిందితుడు వ‌లంటీర్‌ డి.మ‌ణికంఠస్వామిగా గుర్తించారు. నిందితుడ్ని అరెస్టు చేసి రూ.2.4 ల‌క్షలు రిక‌వరీ చేశారు. అనంత‌రం కోర్టుకు హాజ‌రుప‌ర‌చ‌గా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

అయితే బాధితుడు అద్ధంకి శ్రీను మాత్రం త‌న దుకాణంలో రూ.11 ల‌క్షల వ‌ర‌కూ సొమ్ము పెట్టాన‌ని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని పోలీసుల‌కు తెలిపాన‌ని, కానీ త‌న మాట‌లు ప‌ట్టించుకోకుండా కేవ‌లం రూ.2.4 ల‌క్షలు మాత్రమే రిక‌వ‌రీ చూప‌డం దారుణ‌మన్నారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నాడు. ఈ వ్యవహారంలో పెద్దల హ‌స్తం ఉందని ఆరోపించారు. అంతేకాదు నిందితుడిని త‌ప్పించే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. భారీ దొంగ‌త‌నం జ‌రిగితే అందులో చాలా త‌క్కువ సొమ్ము మాత్రమే రిక‌వ‌రీ చేయ‌డంపై ప‌లు అనుమానాలు క‌లుగుతున్నాయి. దీనిపై పోలీసులు మాత్రం చ‌ట్టం ప్రకారంగానే విచార‌ణ చేసి సొమ్ము రిక‌వ‌రీ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా నిందితుడు ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సై అర్హత‌ ప‌రీక్షకు హాజ‌ర‌యిన‌ట్లు తెలుస్తోంది. షాపు య‌జ‌మానితో చ‌నువుగా ఉంటూ షెట్టర్‌కు మారు తాళాలు చేయించి వాటితో దొంగ‌త‌నానికి పాల్పడిన‌ట్లు సమాచారం.



Next Story

Most Viewed