ఉపాధ్యాయుల "ఊరు"గా నాగులాపల్లికి "పేరు"

by Thanuru Gopichand |   (  Updated:2025-10-26 05:53:25  IST  )

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి గ్రామం పేరు వినగానే అది ఉపాధ్యాయుల ఊరు కదా అనే మాట వినిపిస్తుంది.

ఉపాధ్యాయుల ఊరుగా నాగులాపల్లికి పేరు
X

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి గ్రామం పేరు వినగానే అది ఉపాధ్యాయుల ఊరు కదా అనే మాట వినిపిస్తుంది. అవును ఆ మాట నిజమే. ఎందుకంటే. 1987 నుంచి జరిగిన ప్రతి డిఎస్సీ లోనూ ఈ గ్రామానికి చెందిన వారు ఉద్యోగాలను సాధిస్తున్నారు. పట్టుదలగా సాధన చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యి లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ గ్రామానికి చెందిన వారు ఉపాధ్యాయులుగా సేవలను అందిస్తూ నాగులాపల్లి అంటే గురువుల ఊరు అని అనేలా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఇక్కడ ఏకంగా 200 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో అధికంగా ఉపాధ్యాయులే ఉండటం నాగులాపల్లి విశేషం. తాజాగా వెలువడిన మెగా డిఎస్సీ ఫలితాల్లో కూడా నాగులాపల్లి గ్రామ యువతీ, యువకులు ఉపాధ్యాయ కొలువులను సాధించారు.

సర్కార్ కొలువే లక్ష్యంగా సన్నద్ధం

నాగులాపల్లి పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామమైనప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డిగ్రీలు, పీజీలు, బీఈడిలు పూర్తి చేసిన నాగులాపల్లి యువతీ యువకులు సర్కార్ కొలువే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొలువులకు ఎంపిక అవుతూ ప్రత్యేకత చాటుతున్నారు. మిగతా విద్యార్థులు ఆయా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే ఈ గ్రామంలో మాత్రం సమిష్టిగా సాధన చేసి ఉపాధ్యాయ పోస్టులు కైవసం చేసుకుంటున్నారు.

నాగులాపల్లి ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ

గ్రామం నుంచి ఉపాధ్యాయ కొలువు సాధించిన వారు అంతా కలిసి నాగులాపల్లి ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ న్యూస్ ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా డిఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు సూచనలు సలహాలు అందిస్తూ తర్ఫీదు ఇస్తున్నారు. వీరి అనుభవాలతో తయారు చేసిన విలువైన మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. నమూనా పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు మెలకవలను నేర్పిస్తుంటారు.

పరిసర గ్రామాల నుంచి వచ్చి సాధన

గురువుల ఊరుగా నాగులాపల్లి గ్రామానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి పరిసరాల్లోని పిఠాపురం, సామర్లకోట, రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, తైతర ప్రాంతాల నుంచి యువతీ యువకులు ఇక్కడికు వచ్చి సాధన చేసి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉపాధ్యాయుల కొలువులతో పాటు పోలీస్, సైన్యం, గ్రూప్స్ ఇలా వివిధ ఉద్యోగాలకు నాగులాపల్లి యువత ఎంపిక అవుతున్నారు.

Next Story