Ap News: హోంమంత్రి వనితకు ఎదురుగాలి వీస్తోందా..?

by Disha Web Desk 16 |
Ap News: హోంమంత్రి వనితకు ఎదురుగాలి వీస్తోందా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : హోంశాఖ మంత్రి తానేటి వనితకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందా..? కొన్ని సామాజిక వర్గాలు వనితపై గుర్రుగా ఉన్నాయా?. టీడీపీ కంచుకోట అయిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మరోసారి జెండా ఎగురవేసేందుకు టీడీపీ రాజకీయ ఎత్తుగడలు అప్పుడే మొదలు పెట్టేసిందా?. మంత్రి తానేటి వనితకు ఎర్త్ పెట్టేందుకే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పార్టీకి గుడ్ బై చెప్పేశారా?. టీవీ రామారావు పార్టీ వీడటం వెనుక వ్యూహం ఉందా లేక అనూహ్యంగా మారారా? అంటే లేదు లేదు వ్యూహాత్మకంగానే పార్టీ మారారు అంటూ నియోజకవర్గంలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తానేటి వనితతో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుకు అసలు పొసగడం లేదని, ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారని తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో తానేటి వనితను ఓడించేందుకు జరుగుతున్న వ్యూహంలో భాగమంటూ నియోజకవర్గంలో ప్రచారం గుప్పుమంటుంది.

ప్రమోషన్లు ఓకే..కానీ

కొవ్వూరు నియోజకవర్గం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతూ ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ రెండు సార్లు మినహా మిగిలిన సార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో కొవ్వూరు టీడీపీ అడ్డగా పేర్గాంచింది. అయితే టీడీపీలో కీలక నేతగా ఉన్న టీవీ రామారావును పార్టీలో చేర్చుకోవడం, అలాగే టీడీపీలో నెలకొన్న స్థానికత పోరులో వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో వనిత గెలుపు ఒక సవాలే అని చెప్పుకోవాలి. టీడీపీలోని వర్గపోరు వైసీపీ పాలిట వరంగా మారడంతో వనిత గెలుపొందడం.. జగన్ కేబినెట్‌లో కీలకమైన హోంశాఖ మంత్రిగా పని చేయడం చకచకా జరిగిపోయాయి. పదవుల విషయంలో వనితను ప్రమోషన్లు వరిస్తున్నాయి. ఏకంగా కీలకమైన హోంశాఖ పదవి వరించింది. అయితే సొంత నియోజకవర్గం కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పడం లేదు. నియోజకవర్గంలో మంత్రి తానేటి వనితకు వ్యతిరేక గాలి భారీగానే వీస్తుందనే ప్రచారం ఉంది.

గెలుపోటముల డిసైడ్ వారిదే...

కొవ్వూరు నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది కమ్మ, కాపు, మాదిగ సామాజిక వర్గాలు. అయితే మంత్రి తానేటి వనితపై అసంతృప్తితో ఉన్న కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందిన కీలక నేతలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. ఇటీవలే మాదిగ సామాజిక వర్గం నేతలు సైతం వెంట నిలవడం లేదని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరులో తానేటి వనితే పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించినప్పటికీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొవ్వూరు, చాగల్లు మండలాల్లో వనిత చేపట్టిన గడప గడప కార్యక్రమాలనికి స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు గైర్హాజరవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

దూకుడు పెంచిన టీడీపీ

రెండున్నరేళ్లు నియోజకవర్గంలో అసమ్మతిని బయటపడనీయకుండా కాపాడుకున్న మంత్రి తానేటి వనిత అనంతరం చేతులెత్తేశారని తెలుస్తోంది. అసమ్మతి వర్గాన్ని కంట్రోల్ చేయడంలో విఫలం చెంందారు. దీంతో వనితపై సొంత పార్టీ నేతలే విమర్శలకు దిగిన సందర్భాలు లేకపోలేదు. టీడీపీ నేతలతో కలిసి మంత్రి బంధువులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీల్లో మంత్రి బంధువుల జోక్యం పెరిగిపోయిందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో వర్గ పోరు పెరిగిపోయింది. కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ అసమ్మతి బట్టబయలైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయభేరి మోగించింది. 11 డైరెక్టర్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడం సాధారణమైన విషయం కాదు. టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ వరుసగా ఐదోసారి బ్యాంక్ చైర్మెన్ బాధ్యతలు తీసుకోవడం ఒక విధంగా వనితకు పరాభవం అనే చెప్పాలి. ఈ విజయం తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. వైసీపీలోని అసమ్మతి నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.


టీవీఆర్ దూరం ఇబ్బందే

ఇప్పటికే హోంశాఖ మంత్రి తానేటి వనితకు నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో టీవీ రామారావు పార్టీకి దూరమవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీవీ రామారావు పార్టీకి దూరమవ్వడం వైసీపీకి భారీ షాక్ అని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే టీవీ రామారావు 2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే తన సొంత నర్సింగ్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో టీవీ రామారావు జైలుకు సైతం వెళ్లొచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ కేసులు తప్పుడు కేసులని నిర్ధారణకు రావడంతో క్లీన్ చిట్ వచ్చేసింది. 2014లో ఆయనకు టీడీపీ టికెట్ రాకపోవడంతో జవహర్‌కు మద్దతు పలకడంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంత్రి కేఎస్ జవహర్‌కు నియోజకవర్గంలో ఎదురుగాలి వీయడంతో 2019లో తనకే టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. నాన్ లోకల్ అయిన వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు.

టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిక

దీంతో టీవీ రామారావు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనిత గెలుపు కోసం శ్రమించారు. అయితే పార్టీలో నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో టీవీ రామారావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే టీవీ రామారావు టీడీపీలో చేరతారనే ప్రచారం ఉంది. కొవ్వూరు టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్ సైతం కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ హామీ రావడంతోనే ఆయన పార్టీని వీడారనే గుసగుసలు వినిపిస్తు్న్నాయి. మరోవైపు జనసేనలో సైతం చేరతారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. మరి టీవీ రామారావు ఏ పార్టీలో చేరతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


Next Story

Most Viewed