ఏపీ : అమ్మో.. పులి తిరుగుతోంది!!

by Thanuru Gopichand |

తూర్పు గోదావరి (East Godavari) జిల్లా గోపాలపురం మండలం భీమోలులో పులి (Tiger In Bheemolu) సంచారం కలకలం రేపుతోంది.

ఏపీ : అమ్మో.. పులి తిరుగుతోంది!!
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి (East Godavari) జిల్లా గోపాలపురం మండలం భీమోలులో పులి (Tiger In Bheemolu) సంచారం కలకలం రేపుతోంది. పులులు సంచరిస్తున్నాయనే సమాచారంతో భీమోలు ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఓ పులి తన కూనపిల్లలతో భీమోలు పరిధిలోని కొండపై సంచరిస్తున్నట్లు కొందరు స్థానిక రైతులు చెబుతున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ జిల్లా రేంజ్‌ ఆఫీసర్‌ ఎన్‌.దావీదురాజు, డిఆర్‌ఒ జి.వేణుగోపాల్‌, ఎఫ్‌బిఒ వై.శ్రీను బృందం వాటి జాడ కోసం గాలింపు చేపడుతున్నారు. గాలింపులో భాగంగా భీమోలు కొండలను పులి కోసం జల్లెడపడుతున్నారు. ఈ విషయంపై రేంజ్‌ ఆఫీసర్‌ ఎన్‌.దావీదురాజు మాట్లాడుతూ.. భీమోలు కొండలపై ఒక రైతుకు చెందిన పొలం ఉందన్నారు. ఆ పొలంలో డిసెంబరు 11న ఆడపులి, కూన పులులు కనిపించాయని సమాచారం అందిందన్నారు. దీంతో కొండపై సుమారు రెండు కిలో మీటర్ల మేర పులి జాడ కోసం తిరిగామన్నారు. అయితే తమ పరిశీలనలో పులులకు సంబంధించిన జాడలు, గుర్తులు లభించలేదని పేర్కొన్నారు.

ప్రజలు భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో పులి జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నామని దావీదురాజు పేర్కొన్నారు. కొండలపై ఆరు ట్రాప్ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు. భీమోలులోని కొండలపైన ఉద్యాన సాగు పంటలు ఉన్నాయన్నారు. దట్టమైన అడవి మాదిరి అవి కనిపించడం వల్ల పులి దారి తప్పి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పులులు కనిపిస్తే దాడి చేయకుండా వాటి నుంచి తప్పించుకొని సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలన్నారు. అదే విధంగా తమకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. కొండపైకి వెళ్లే రైతులు, కూలీలు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత వెళ్లి ఐదు గంటల్లోపు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఇద్దరూ లేదా ముగ్గురు మాత్రమే కలిసి పొలాలకు వెళ్లాలని సూచించారు. ట్రాప్‌ కెమెరాలను సోమవారం పరిశీలిస్తామని, ఆ తర్వాత ఒక నిర్ధారణకు వస్తామని వెల్లడించారు.

Next Story