తీవ్ర విషాదం.. పుట్టినరోజునే పాముకాటుతో బాలిక మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-10 07:00:31  IST  )

కాకినాడ జిల్లాలో విషాదం ఘటన జరిగింది. జగనన్న కాలనీలో 14 ఏళ్ల బాలికను విషసర్పం కాటేసింది.

తీవ్ర విషాదం.. పుట్టినరోజునే పాముకాటుతో బాలిక మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/ పిఠాపురం : రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. యు. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఓ బాలిక పాముకాటుకు బలైంది. ముందు రోజే ఎంతో సంబరంగా పుట్టినరోజు జరుపుకున్న బాలిక, తెల్లవారేసరికి అనంతలోకాలకు వెళ్లిపోయింది. గురువారం రాత్రి స్థానిక జగనన్న కాలనీకి చెందిన చప్పా దీపిక (14) ఇంటి పనులు పూర్తిచేసి తల్లితో కలిసి మంచంపై పడుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఓ విషసర్పం ఆ మంచం కిందికి దూరి.. నిద్రలో ఉన్న దీపికను కాటు వేసింది. బాలికను ఏదో కరచినట్టుగా అనిపిస్తే మొదట ఎలుక కరిచింది అనుకున్నారు. ఉదయం ఆసుపత్రికి తీసుకు వెళ్దామని అనుకునే లోపు పాప పరిస్థితి విషమించింది. దీంతో హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దీపిక స్థానిక ZP స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.

Next Story