- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG డెలివరీలపై ఆందోళన వద్దు : సీఎం చంద్రబాబు
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో LPG సిలిండర్ల లభ్యత, డెలివరీలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా అంశంపై మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి సీఎస్ సాయిప్రసాద్, వివిధశాఖల ఉన్నత అధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలున్నట్లు తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందన్నారు. ఇప్పటికి రాష్ట్రంలో LPG సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎం స్పష్టం చేశారు.
కాగా.. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ సరఫరా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తక్షణమే ప్రజలకు గ్యాస్ అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్లు అర్హులైన వారికి చేరేలా చూడాలని, ఇందులో ఎలాంటి డైవర్షన్లు ఉండకూడదని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ లభ్యత కూడా పెరిగేలా చూడాలన్నారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలన్నారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. ఏపీలోని కేజీ బేసిన్ సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎన్జీ, పీఎన్జీల వినియోగం గరిష్ఠంగా పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.






