- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొలికపూడికి క్రమశిక్షణ కమిటీ గట్టి హెచ్చరిక
ఎన్టీఆర్ భవన్ లో జరిగిన తిరువూరు (Tiruvuru) పంచాయితీలో ఎమ్మెల్యే కొలికపూడికి క్రమశిక్షణ కమిటీ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ భవన్ లో జరిగిన తిరువూరు (Tiruvuru) పంచాయితీలో ఎమ్మెల్యే కొలికపూడికి క్రమశిక్షణ కమిటీ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో విభేదాలు, పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు క్రమ శిక్షణ కమిటీ ఎదురుగా మంగళవారం హాజరయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వేరు వేరు సమయాల్లో రావాలని, మద్ధతుదారులను వెంట తీసుకు రావొద్దని వారికి ముందే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. కొలికపూడి మంగళవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, షరీఫ్, పంచమర్తి అనురాధతో కూడిన కమిటీ ఎదుట హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కూడా విచారణలో పాల్గొన్నారు.
అసలేం అనుకుంటున్నారు?
కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను విచరిస్తూ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారని నిలదీసింది. పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో గ్రహించాలని హితవు పలికింది. సొంతగా పోటీ చేస్తే డిపాజిట్ అయినా దక్కేదా అని ఘాటు వ్యాఖ్యలు చేసిన క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) సభ్యులు కొలికపూడిపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. ఎంపీ కేశినేని చిన్నితో వివాదం ఉంటే సీఎంకు తెలియజేయాలని లేదా పార్టీ వేదికపై ప్రస్తావించాలి తప్ప బహిరంగంగా ఆరోపణలు చేయడం ఏమిటని గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.
ఆధారాలు ఉన్నాయా?
కొలికపూడితో క్రమశిక్షణ కమిటీ దాదాపు 4 గంటల పాటు మాట్లాడింది. ఎంపీ చిన్ని పై ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలపై వివరణ తీసుకుంది. గతంలో తాను చేసిన ఆరోపణలనే కొలికపూడి పునరుద్ఘాటించినట్లు తెలిసింది. వాటికి ఆధారాలేంటని కమిటీ సభ్యులు ప్రశ్నించగా తాను విన్నవి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న అంశాల ఆధారంగానే మాట్లాడానని కొలికపూడి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ప్రత్యర్థులు ప్రోత్సహిస్తున్నారని, పోటీ వర్గాన్ని తయారు చేస్తున్నారని కమిటీ సభ్యులతో కొలికపూడి చెప్పినట్లు తెలిసింది. పార్టీ లైన్ ఇంకా తనకు అర్థం కాలేదన, ఇక పై పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని కొలికపూడి చెప్పినట్లు సమాచారం.
ఎమ్మెల్యేతో పార్టీకి నష్టం
ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) సాయంత్రం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కేశినేని చిన్నితో కమిటీ సభ్యులు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. తిరువూరులో పరిణామాలు, ఎమ్మెల్యేతో విభేదాలకు కారణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతోందని చిన్ని కమిటీకి వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన కమిటీకి అందజేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తనపై చేసిన అసత్య ఆరోపణలతో తన కుటుంబ సభ్యులు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారని కానీ పార్టీ ఆదేశాల మేరకు మౌనం వహించానని ఎంపీ అన్నట్లు తెలిసింది. తాను చంద్రబాబుకు వీరభక్తుడినని పార్టీయే తనకు సుప్రీమని, సమావేశం అనంతరం కేశినేని అన్నారు. తిరువూరులో తనకు జరిగిన అవమానం కంటే ఎమ్మెల్యే వల్ల అక్కడ పార్టీకి జరిగిన నష్టం ఎక్కువ అన్నారు. తిరువూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
ఫైనల్ డెసిషన్ సీఎందే
వారివురి నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో (Minister Lokesh) భేటీ అయ్యారు. ఇద్దరి వాదనలు కమిటీ అభిప్రాయాన్ని ఆయనకు వివరించారు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీకి అతీతులు కాదని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన లోకేష్ కమిటీ సభ్యులతో అన్నట్లు తెలిసింది. నేడు నివేదిక సిద్ధంగా చేసి సీఎం చంద్రబాబుకు (CM Chandra Babu Naidu) అందజేయాలనికి మంత్రి లోకేష్ కమిటీకి సూచించారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని లోకేష్ అన్నారు.






