పాడి రైతుకు కష్ట కాలం..తగ్గుతున్న పాల దిగుబడి

by velandi.Saikiran |   (  Updated:2026-03-18 22:16:10  IST  )

పాడి రైతుకు కష్ట కాలం వచ్చింది. వేసవి కారణంగా పశువులకు తీవ్ర మేత కొరత ఏర్పడింది.

పాడి రైతుకు కష్ట కాలం..తగ్గుతున్న పాల దిగుబడి
X

పాడి రైతుకు కష్ట కాలం!

* పశువులకు తీవ్ర మేత కొరత

* తగ్గుతున్న పాల దిగుబడి

* పతనమవుతున్న ధరలు

దిశ, చిత్తూరు ప్రతినిధి: పాడి రైతుకు కష్ట కాలం వచ్చింది. వేసవి కారణంగా పశువులకు తీవ్ర మేత కొరత ఏర్పడింది. ప్రైవేటు మార్కెట్‌లో మేత ధర ఆకాశానికి పెరిగిపోతోంది. మేత కొరత కారణంగా పాల దిగుబడి తగ్గి పోయింది. మరోవైపు పాల డెయిరీలు ఇచ్చే ధర గిట్టుబాటు కాక, పాడి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన ఈ జిల్లాలో వ్యవ‘సాయం’ గిట్టుబాటు కాక వేలాది కుటుంబాలు పశువులనే నమ్ముకుని బతుకుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడి పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు లాభదాయకంగా ఉన్న పాడి నేడు అప్పుల కుప్పగా మారింది.

పెట్టుబడి 'భారం'.. ఆదాయం 'శూన్యం'

ప్రస్తుతం ఒక లీటరు పాలకు రైతుకు అందుతున్న ధర కేవలం రూ.37 మాత్రమే. కానీ పశువును పోషించడానికి అయ్యే ఖర్చు అంతకు రెండింతలు ఉంది. గతంలో రూ.700 ఉన్న ఫీడ్ బస్తా ఇప్పుడు రూ.1,000 దాటిపోయింది. 45 కిలోల నాణ్యమైన దాణా బస్తా ధర ఏకంగా రూ.1,500 పలుకుతోంది. రూ.600 ఉన్న బూసా బస్తా రూ.900కి... కిలో రూ.50 ఉండే గానుగ పిండి రూ.70కి పెరగడంతో రైతు నెత్తిన పిడుగు పడ్డట్లయింది. రెండేళ్ల క్రితం రూ.120 పలికిన గడ్డి కట్ట, నేడు మేత కొరత వల్ల రూ.300 చెల్లించినా దొరకని పరిస్థితి నెలకొంది.

వైద్యం భారమై...

వేసవి ఎండల తీవ్రతకు పశువులకు రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. ఒకవైపు వ్యాధులతో పశువులు చనిపోతుంటే, మరోవైపు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయి రైతును బెంబేలెత్తిస్తున్నాయి. ఇతర ఎరువుల ధరలు భరించలేక, సహజ ఎరువులు దొరకక కేవలం యూరియాతో పండించే మేతను పశువులకు వేయాల్సి వస్తోంది. ఈ 'యూరియా మేత' తిని పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. గతంలో పూటకు 5లీటర్లు ఇచ్చే పాడి పశువు రూ.40 వేలకు దొరికేది. అది ఇప్పుడు రూ.70 వేల నుంచి రూ.80 వేలకు చేరింది. పాడిపశువు చనిపోతే రైతు కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ చెల్లింపులు

మన పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు డెయిరీలు లీటరుకు మనకంటే రూ.5 నుండి రూ.7 వరకు ఎక్కువగా చెల్లిస్తుండటం గమనార్హం. అక్కడ టోన్డ్ మిల్క్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. డెయిరీలు రైతు నుంచి గరిష్టంగా లీటరుకు రూ.40 లోపు కొనుగోలు చేస్తూ, వినియోగదారుడికి మాత్రం రూ.55 నుండి రూ.60 వరకు అమ్ముతున్నాయి. ఇక పెరుగు ధరలయితే లీటరుకు రూ.70 నుండి రూ.80 వరకు విక్రయిస్తూ భారీ లాభాలు గడిస్తున్నాయి. డెయిరీల ఈ పక్షపాత ధోరణి వల్ల రైతుకు దక్కాల్సిన వాటా మధ్యవర్తుల పాలవుతోంది.

పాలకులు కరుణించాలి

అన్నం పెట్టే రైతు ఆకలితో అలమటిస్తున్నాడు. పాలకులు ఇకనైనా కళ్లు తెరిచి, పాడి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మేత కొరతను తీర్చడానికి చర్యలు చేపట్టాలి. పాడి పశువుల మందుల ధరలను తగ్గించి, గ్రామ స్థాయిలో వైద్య సదుపాయాలు పెంచాలి. పాల కొనుగోలు ధరను పెంచి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. పాలకులు చొరవ చూపకపోతే... చిత్తూరు జిల్లాలో పాడి రైతుకు మరిన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంది.

Next Story