భయపెడుతున్న డీజిల్ కొరత.. పలుచోట్ల మూతపడుతున్న పెట్రోల్ బంకులు

by Ramesh Naini |   (  Updated:2026-04-26 05:14:18  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భయపెడుతున్న డీజిల్ కొరత.. పలుచోట్ల మూతపడుతున్న పెట్రోల్ బంకులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా డీజిల్ నిల్వలు అడుగంటడంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఇంధనం దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ కొరత చూసి భయాందోళన చెందుతున్న కొందరు, ముందుజాగ్రత్తగా లీటర్ల కొద్దీ పెట్రోల్‌ను బాటిళ్లలో, క్యాన్లలో నింపుకుని వెళ్తున్నారు. ఈ ఇంధన కొరతకు సంబంధించి ప్రధాన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి.

విజయవాడ పరిసరాల్లో తీవ్ర ప్రభావం

ఉమ్మడి కృష్ణా-ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంధన కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ జిల్లా వ్యాప్తంగా ఏకంగా 100 పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు ఏర్పాటు చేశాయి. ఎక్కడైనా కొద్దిపాటి స్టాక్ వచ్చిందన్న సమాచారం తెలిస్తే చాలు, ఆయా బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. తిరువూరు, కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లోని బంకుల వద్ద సరైన నిల్వలు లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం మైలవరం మండల పరిధిలోనే సుమారు 7 బంకుల్లో డీజిల్ కొరత నెలకొనడంతో అవి మూతపడ్డాయి.

ఇతర జిల్లాలకు పాకిన సెగ

కేవలం విజయవాడకే పరిమితం కాకుండా ఈ ఇంధన కటకట రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా పాకింది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక వాహనదారులు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కోస్తా జిల్లాలు.. మచిలీపట్నం, కాకినాడ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధనం కోసం వాహనదారులు బంకుల ముందు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సమయానికి ఇంధనం దొరకకపోవడంతో రవాణా వ్యవస్థపై, సామాన్య ప్రజల రోజువారీ ప్రయాణాలపై ఈ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story