సోషల్ మీడియాలో పోస్టులపై డిజిపి హెచ్చరిక

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో పోస్టులపై డిజిపి హెచ్చరిక
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.

సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించుకోవాలి. మతం, వర్గ, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు లేదా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు అనివార్యం అని డీజీపీ స్పష్టం చేశారు. అటువంటి పోస్టులు పెట్టిన వారిని గుర్తించి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. తప్పుడు వార్తలు దుష్ప్రచారం చేసినా కూడా అది నేరమేనని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా పోస్టుల ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు రేపే ప్రయత్నం చేసే వారిపై పలు సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఎంత పెద్దవారైనా, ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ మినహాయింపు కాదని ఆయన స్పష్టం చేశారు.

సా ఫ్ట్ వేర్ , ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ.సోషల్ మీడియా వేదిక ద్వారా జాతి, మతం, భాష, ప్రాంతం, కులం, వర్గం, వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాల సృష్టించేలా పోస్టులు పెడితే బిఎన్ఎస్ 353 (2) (3) సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిఆయా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత సంస్థల దృష్టికి తీసుకువెళ్లి, వారిని ఉద్యోగం నుండి తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలు, ప్రేరణాత్మక వీడియోలను సహించబోమని స్పష్టం చేశారు.

వివాదాలు, ఘర్షణలకు దారి తీసే సున్నితమైన అంశాలతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సోషల్ మీడియా మాధ్యమాలపై నిరంతర నిఘా ఉందని, అనుచిత కంటెట్ పోస్టు చేసిన వారిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, తక్షణమే అరెస్టు చేసి న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.. వాస్తవాలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా... పోలీస్ శాఖను అపఖ్యాతి పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు.

తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం చేసే వ్యక్తులు, అకౌంట్లు లేదా హ్యాండిల్స్ పై చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. చట్టపరమైన సమాచారాన్ని పంపే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని లేకపోతే వారికి చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలు నిర్మాణాత్మకమైన, నిజాయితీతో కూడిన సమాచార మార్పిడికి వేదికగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ ప్రకటనలో డీజీపీ విజ్ఞప్తి చేసారు.

Next Story