తిరుమలలో వైభవంగా చక్రస్నానం.. రథసప్తమి వేడుకల్లో భక్తజన సందోహం

by Ramesh Naini |

తిరుమల క్షేత్రంలో ఆదివారం రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.

తిరుమలలో వైభవంగా చక్రస్నానం.. రథసప్తమి వేడుకల్లో భక్తజన సందోహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల క్షేత్రంలో ఆదివారం రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ‘మినీ బ్రహ్మోత్సవం’గా పేరుగాంచిన ఈ వేడుకల్లో భాగంగా మొదటి అర్ధ భాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన చక్రస్నానంతో ఘనంగా ముగిసింది.సూర్యోదయ వేళ అత్యంత శోభాయమానంగా సాగిన సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వరుసగా చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీమన్నారాయణుడి రూపంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గ్యాలరీల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.

పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం..

మొదటి అర్ధ భాగంలో నాలుగు వాహన సేవలు పూర్తి అయిన తర్వాత, శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చక స్వాములు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పవిత్ర పుష్కరిణి జలాల్లో శాస్త్రోక్తంగా పవిత్ర స్నానాన్ని (పుణ్య స్నానం) ఆచరింప జేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Next Story