కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు.. మెట్లమార్గం క్లోజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-15 16:18:43  IST  )

కోటప్పకొండకు భక్తుల తాకిడి పెరిగింది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలం, జాగరణ కీలకం కావడంతో సాయంత్రం నుంచి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది.

కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు.. మెట్లమార్గం క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదుకో కోటయ్య.. చేదుకో కోటయ్య అంటూ.. మహాశివరాత్రినాడు ఆ త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు కోటప్పకొండకు తరలివెళ్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునుంచే కోటప్పకొండకు భక్తుల తాకిడి పెరిగింది. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరగడంతో.. బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్లమార్గంలో భక్తులను రానివ్వడం లేదు. మరోవైపు కొండపైకి వెళ్లే బస్సులు, కిందికి వచ్చే బస్సులు సైతం నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గంటకు పైగా బస్సులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో పోలీసులు పట్టించుకోవడం లేదని, చర్యలు తీసుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగోద్భవ కాలంలో శివయ్యను దర్శించినా చాలనుకునేవారెందరో. జాగరణ చేసేందుకు కొండకు వెళ్లే భక్తుల సంఖ్య ఉన్నట్లుండి పెరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

కోటప్పకొండ తిరనాళ్లలో ప్రభలు కనువిందు చేస్తాయి. ఈ ప్రభల మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు. పంటలు పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఏడాదంతా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాలు ప్రభలను తయారు చేసి.. కొండకు తీసుకొచ్చి అలంకరించడం ఆనవాయితీ. ఒక్కో ప్రభ వెంట ఆ గ్రామమంతా తరలివస్తారు. 80-100 అడుగుల ఎత్తులో విద్యుద్దీప కాంతులతో కనిపించే ప్రభల తయారీకి సుమారుగా రూ.20-25 లక్షలు ఖర్చవుతుందని తెలుస్తోంది.

Next Story