రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలి : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.

రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలి : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన జీఎంఆర్, మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందనే నాయకులను మాత్రమే తాము చూశామన్నారు. కానీ మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉత్తరాంధ్ర నిజంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్నో అద్భుతమై కార్యక్రమాల అమలు ఉత్తరాంధ్రలో జరుగుతోందన్నారు. సీఎం చంద్రబాబు పనులు అయ్యే వరకు తాను నిద్రపోరని.. ఇతరులను కూడా నిద్రపోనివ్వరని అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ఆయన కోవలోనే పయనిస్తున్నారని సరదా వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాబోయే తరానికి అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం మెండుగా ఉందన్నారు. ప్రజల సహకారం కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారు. అభివృద్ధి పనులకు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. అటువంటి విధానం సరికాదని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పని చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

జీఎంఆర్ అధినేతను దిల్లీలో కలిశాను

జీఎంఆర్ అధినేతను ఒకసారి దిల్లీలోని వారి నివాసం కలిశామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన వద్ద భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ప్రస్తావించామన్నారు. దానిపై జీఎంఆర్ స్పందిస్తూ తన పుట్టిన ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారన్నారు. భగవంతుడు తనకు ఆ అవకాశం కల్పించారని.. అది తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారన్నారు. ఇదే క్రమంలో భీమిలి నియోజకవర్గం పరిధిలో ఏవియేషన్ ఎడ్యుసిటీ రావడం శుభపరిణామంగా పేర్కొన్నారు.

గవర్నర్ అశోక గజపతి రాజుకు ధన్యవాదాలు

ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు ఎటువంటి స్వలాభం ఆశించకుండా గోవా గవర్నర్ అశోక గజపతి రాజు మాన్సాస్ విద్యా సంస్థల భూములను ఇవ్వడం పట్ల స్పీకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల తరపున, తన తరపున ధన్యవాదాలను తెలియజేశారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం ఉదారంగా భూములు ఇచ్చిన చరిత్ర పూసపాటి రాజ వంశస్తులదని కొనియాడారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వారు విద్యా రంగం కోసం తృణప్రాయంగా అందజేశారని గుర్తు చేసుకున్నారు. సుశీల, ఘంటసాల, కోడి రామ్మూర్తి వంటి వారు విజయనగరం సంస్థానం నుంచి వచ్చినవారేనని గుర్తు చేసుకున్నారు. అశోక గజపతి రాజు రాజ వంవస్థులైనప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపే వ్యక్తి అని.. తనకెంతో సన్నిహితులని తెలిపారు.

Next Story