దేవాన్ష్, నేను అన్నదమ్ముల్లా కొట్టుకుంటాం.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

by Ramesh Naini |

తన కుమారుడు దేవాన్ష్‌తో తనకున్న అనుబంధంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేవాన్ష్, నేను అన్నదమ్ముల్లా కొట్టుకుంటాం.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన కుమారుడు దేవాన్ష్‌తో తనకున్న అనుబంధంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చెబుతూ వారికి పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల సాధించిన ఉత్తమ ఫలితాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, వారితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పలు వ్యక్తిగత, విద్యా సంబంధిత విషయాలను పంచుకున్నారు.

దేవాన్ష్‌తో నా అనుబంధం అలాంటిది..

తన కుమారుడు దేవాన్ష్, తానూ ఇంట్లో ఎప్పుడూ అన్నదమ్ముళ్లలా కొట్టుకుంటూ ఉంటామని మంత్రి లోకేశ్ సరదాగా వ్యాఖ్యానించారు. కుమారుడికి తానెప్పుడూ సలహాలు ఇవ్వనని, ఆ బాధ్యతను తన భార్య బ్రాహ్మణియే పూర్తిగా చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఒకసారి దేవాన్ష్‌తో చెస్ ఆడి ఓడిపోయానని, ఆ దెబ్బతో తన పరువంతా పోయిందంటూ ఆయన చేసిన ఫన్నీ కామెంట్స్ సభికులను నవ్వించాయి. ప్రస్తుతం లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ విద్యా వ్యవస్థలోనే ఎక్కువ సక్సెస్ అయ్యా..

విద్యా వ్యవస్థపై స్పందిస్తూ లోకేశ్ తన స్వీయ అనుభవాలను వివరించారు. భారతీయ విద్యా వ్యవస్థలో కంటే, అమెరికా విద్యా వ్యవస్థలోనే తాను ఎక్కువగా సక్సెస్ అయ్యానని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని హితబోధ చేశారు. ‘ఫెయిల్ (FAIL)’ అంటే జీవితం ముగిసిపోయినట్లు కాదని, నేర్చుకోవడంలో అది మొదటి ప్రయత్నం (First Attempt In Learning) అని విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని నింపే ప్రయత్నం చేశారు.

నా జీవితమే మీకు ఓ ఉదాహరణ

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తన రాజకీయ జీవితాన్నే ఆయన ఉదాహరణగా చూపారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని ఆయన గుర్తుచేశారు. అయితే ఆ ఓటమితో కుంగిపోకుండా, పట్టువదలకుండా ఐదేళ్లు నిరంతరం కష్టపడి పని చేయడం వల్లే ఈరోజు 91 వేల భారీ మెజారిటీతో విజయం సాధించగలిగానని వివరించారు. ఈ ప్రయాణమే విద్యార్థులకు స్ఫూర్తి కావాలన్నారు.

Next Story