21 సీట్లలో పోటీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-20 11:21:03  IST  )

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకంలో భాగంగా రూ. 7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు.

21 సీట్లలో పోటీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకంలో భాగంగా రూ. 7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. ఈ రోజు(శనివారం) ఉదయం నిడదవోలు నియోజకవర్గం పెరవలి వద్ద జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో సుమారు రూ. 7,910 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, దీని ద్వారా దాదాపు 1.21 కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి డెల్టా ప్రాంతంలోని ఐదు జిల్లాలు (తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ) ప్రయోజనం పొందనున్నాయి. కేవలం గోదావరి జిల్లాల కోసమే రూ. 3,050 కోట్లను కేటాయించారు. ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికీ సరఫరా చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ నిధులతో చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ పథకానికి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం 'అమరజీవి జలధార' అని పేరు పెట్టడం విశేషం.

అలాగే గత అసెంబ్లీ ఎన్నికలై సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై పవన్ స్పందిస్తూ.. తాను జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తి అయిందని, గత ఎన్నికల్లో తాను టికెట్లు అమ్ముకున్నానని తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. కానీ తాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నాని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొందరు గుండాగిరి చేస్తున్నారని అలాంటి వారి ఆటలు కట్టించేందుకు తమకు రెండు రోజుల చాలని, కాళ్లు, చేతులు తీసేస్తే ఆకు రౌడీలు దారిలోకి వస్తారని, ఇలాంటివారికి సీఎం యోగీ ట్రీట్మెంట్ కరెక్ట్ అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మాజీ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

అలాగే మాజీ సీఎం జగన్, వైసీపీ నేతల బెదిరింపులపై స్పందిస్తూ.. తాను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భయపడలేదని, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లననే వచ్చేవాడినని గుర్తు చేశారు. అలాగే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఇతర దేశాల్లో ఉండి తాము అధికారంలోకి రాగానే అంతుచూస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి వారిని తాము ఎట్టిపరిస్థితుల్లో బయపడమని, వారిని అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.

అలాగే తాము చేసే పనులపై విమర్శించేవారు విమర్శించవచ్చని, కానీ దానికి ఓ లిమిట్ ఉంటుందని, ఆ గీత దాటితే అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసని ఈ మేరకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడని ఇది ఎంతవరకు సమంజసమని తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. అడ్డగోలిగా ఏది పడితే అది చేస్తామని అంటే.. చూస్తూ ఊరుకోమని, తాను ఈ వ్యాఖ్యలను ఎంతో వేదనతో చెబుతున్నానని ఎవరికి ఎలాంటి చికిత్స అందించాలో తమకు తెలుసని ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

READ MORE ....

నక్సలిజం కకావికలం అయిపోయింది.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Next Story