Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ గొప్ప నిర్ణయం.. జీతం మొత్తం వారి సంక్షేమం కోసమే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-09 16:23:51  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జీతం మొత్తాన్నీ అనాథపిల్లల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు ప్రకటించారు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ గొప్ప నిర్ణయం.. జీతం మొత్తం వారి సంక్షేమం కోసమే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జీతం మొత్తాన్నీ అనాథపిల్లల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి (Pithapuram Constituency) చెందిన 42 మంది అనాథ పిల్లలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున రూ.2,10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. తనజీతంలో మిగతా మొత్తాన్ని వారి బాగోగుల కోసం ఖర్చు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇక ప్రతి నెలా పిల్లలకు తమ ఇళ్లకే ఆర్థిక సహాయం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు.. అభివృద్ధితో పాటు సమస్యల్ని కూడా పరిష్కరించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అధికారం వల్ల వచ్చే వేతనాన్ని వారికోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నానని, అందులో భాగంగానే తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల భవిష్యత్ కోసం వేతనాన్ని ఖర్చు చేస్తానన్నారు. ప్రభుత్వం, పదవిలో ఉన్నంతకాలం తన జీతం మొత్తం అనాథ పిల్లల సంక్షేమానికి, వారి చదువుల కోసం మాత్రమే వినియోగిస్తానని స్పష్టం చేశారు.

Next Story