Heavy Rains:బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-26 09:33:51  IST  )

రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.

Heavy Rains:బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని APSDMA వెల్లడించింది. ఈ తరుణంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబర్, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సముద్రంలో అలజడి గా మారనున్న సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రానికి భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story