ఇండిగో సమస్య పరిష్కారానికి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్!!

by Thanuru Gopichand |

ఇండిగో విమానాల రద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Indigo) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు.

ఇండిగో సమస్య పరిష్కారానికి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్!!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండిగో విమానాల రద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Indigo) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు. సంక్షోభానికి దారి తీసిన కారణాలపై వారు సమావేశంలో చర్చించారు. సమస్యకు కారణాలేమిటి? అసలెందుకు సమస్య తలెత్తింది? సమస్యకు చూపగల తక్షణ పరిష్కారాలేమిటి అనే అంశంపై సమావేశంలో సమీక్షించారు. వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండడంతో సమస్య పరిష్కారం కోసం చైర్మన్, సీఈఓ, బోర్డు సభ్యులతో కలిపి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ (Crisis Management Group) ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకోనుందని బోర్డు సభ్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల టిక్కెట్ సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు సంస్థ చర్యలను వేగవంతం చేసినట్లు ఇండిగో డైరెక్టర్ల సమావేశంలో తెలిపారని సంస్థ ప్రకటించింది.

గుత్తాధిపత్యం వల్లనేనా?

రవాణా రంగంలో గుత్తాధిపత్యం ఎన్ని అనర్ధాలు దారి తీస్తుందో ఇండిగో వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం ఒకే ఒక విమానయాన సంస్థ ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుందో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ అసమర్థత, అవకతవకలు, నిర్లక్ష్యం , నిరంకుశత్వం అందుకు తాజా నిదర్శనాలుగా అభివర్ణిస్తున్నారు. దేశంలో దాదాపు 1200 విమాన సర్వీసులతో 63 శాతం మార్కెట్ షేర్ తో దేశ, విదేశీ విమానయాన రంగంలో ఇండిగో నిలిచింది. గత ఏడేళ్లుగా దీని విస్తరణ విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్వహణ కూడా ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాగిపోయిందని అభిప్రాయాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.

బాధ్యతారాహిత్యం కూడా!

సమయపాలన లేకపోవడం, ప్రయాణికుల పట్ల బాధ్యతగా వ్యవహరించక పోవడం, విమానయాన రంగంలో పాటించాల్సిన కనీస ప్రమాణాలను కూడా పాటించకపోవడం, బాధ్యత రాహిత్యం ఇలా అన్ని రంగాల్లోనూ ఇండిగో విఫలం అయిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాజాగా విమాన సర్వీసులు రద్దుతో అల్లకల్లోలం సృష్టించిందనే భిన్నాభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ కూడా కూడా విమానాల రద్దు కారణంగా ప్రయాణికులతో కిటికీటలాడుతూ కనిపిస్తున్నాయి. విమాన సర్వీసులు విషయంలో ప్రయాణికులకు సమాచారం చేరవేయడంలో ఇండిగో నిర్లక్ష్య ధోరణి ఈనాటిది కాదని నిపుణులు అంటున్నారు.

అవి నిజం కాకపోవచ్చు

పైలట్ల డ్యూటీ వేళల్లో మార్పులు వలన, సాఫ్ట్వేర్ లో చిన్న లోపం వల్ల ఇదంతా జరిగిందని సంస్థ చెబుతున్నప్పటికీ అవి ఏవి నిజం కాదని మార్కెట్ రంగ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండిగో గత త్రైమాసికంలో 2562 కోట్ల రూపాయలు నష్టాలను చవి చూసిందంటున్నారు. దీంతో ఆ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో పొదుపు చర్యలకు ఉపక్రమించి ఇంత అనర్ధానికి దారి తీసింది అనే వాదనను తెరపైకి తెస్తున్నారు. వేల మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లో రోజుల తరబడి కూలవేసే పరిస్థితి వచ్చినప్పటికీ ఇండిగో నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం విచారకరం. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు డబ్బులు తిరిగి ఇప్పించే పరిస్థితి లేకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలతో, భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story