Cpi Ramakrishna: అమిత్ షాపై ఆగ్రహం.. సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

భారత రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదని సీపీఐ రామకృష్ణ అన్నారు..

Cpi Ramakrishna: అమిత్ షాపై ఆగ్రహం.. సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదని సీపీఐ రామకృష్ణ అన్నారు. డా బీఆర్ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీకి కావలసింది మనుస్మృతి రాజ్యాంగమని, ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్తున్నారన్నారు. అందుకే అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. బీజేపీ‌కి స్వాతంత్ర్య సమరయోధులు అంటే లెక్క లేదని, RSS‌కి స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం లేదన్నారు. ఈ దేశంలో RSS సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తున్నారని, పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌కి జరిగింది ఘోరమైన అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

‘‘మహాత్మ గాంధీనీ అనుక్షణం అవమానిస్తున్నారు. మహాత్మా గాంధీని వీర సావర్కర్‌తో పోల్చడమేంటి..?. గాంధీ ఎక్కడ ? సావర్కర్ ఎక్కడ ?. అంబానీ, అదానీ‌కి దేశాన్ని దోచిపెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. డబ్బుతో రాజకీయాలను శాసిస్తున్నారు. మాట వినని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బీజేపీ ఉన్మాద రాజకీయాలు చేస్తుంది. మైనారిటీలు అంటే బీజేపీ రెండో క్యాటగిరి‌గా చూస్తోంది. మోడీ మానవ మాత్రుడు కాదు. ఈ రాష్ట్రంలో బాబు, పవన్, జగన్ అందరు మోడీ తొత్తులే. అంబేద్కర్ రాజ్యంగంతోనే వీళ్ళకు పదవులు వచ్చాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నోరు మెదపడం లేదు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడం లేదు. సరైంది కాదు అని కూడా చెప్పడం లేదు. అంబేద్కర్ ను గౌరవించాలి అని కూడా చెప్పడానికి ధైర్యం లేదు. బీజేపీ‌కి బాబు, పవన్, జగన్‌లు భయపడుతున్నారు. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఉన్న దళితులను, మైనారిటీలను అవమానించారు.’’ అని రామకృష్ణ మండిపడ్డారు.

Next Story