Viveka Murder Case: వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు..

by Disha Web Desk 12 |
Viveka Murder Case: వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అంతేకాదు ఈ ఏడాది మే 5లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకు తెలంగాణ హైకోర్టు తెలిపింది. వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు. అయితే తొలుత ఈ హత్యకేసును సిట్ దర్యాప్తు చేసిన తరుణంలో సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన సీబీఐ ఆయన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరడంతో తాజాగా బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు తీర్పు సీబీఐకు ఊరట లభించింది.

డిఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్న గంగిరెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. డిఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్న ఎర్ర గంగిరెడ్డి సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపిస్తూ గతేడాది నవంబర్ 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అలాగే ఈ హత్యకేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. ఈనెల 26తో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును గురువారం వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో గురువారం ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఉదయం 11 గంటలకు తీర్పు వెల్లడించింది. బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దూకుడు పెంచిన సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసు దర్యాప్తులో వేగం పెంచింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో కేసు దర్యాప్తులో వేగం పెంచింది. ఇందులో భాగంగా అటు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని వారు చేస్తున్న ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకున్న సీబీఐ అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టింది. కుటుంబ సభ్యుల్లో ఆస్తితగాదాలపై కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, అల్లుడురాజశేఖర్ రెడ్డిలను సైతం విచారించింది. అలాగే వివేకానందరెడ్డి రెండో భార్య షేక్ షమీమ్‌ను సైతం విచారించింది. ఇక హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కీలక సమాచారం రాబట్టవచ్చిన సీబీఐ భావిస్తోంది. మెుత్తానికి ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కావడం సీబీఐకు ఊరట అనే చెప్పాలి. మే 5 నాటికి ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ కస్టడీ కోరనుందని తెలుస్తోంది. కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తున్నందున ఈ కేసును కూడా తెలంగాణ హైకోర్టు విచారించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఈ విసయమై అన్ని వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది.



Next Story

Most Viewed