అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |   (  Updated:2025-10-27 07:43:38  IST  )

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు

అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజలకు వాతావరణ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలన్నారు. తుఫాను కారణంగా రహదారులపై నేలకొరిగే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అందుకోసం కావాల్సిన పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. నిరంతరం నీటి సరఫరా కోసం కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలన్నారు. వీలైనంత వరకు తుఫాను కారణంగా కలిగే నష్టాన్ని నివారించేందుకు పని చేయాలని మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని కోరారు.

Next Story