కారు తీయకుండానే రోడ్డేశారు.. చివ‌రికి!

by Ajay kumar |
కారు తీయకుండానే రోడ్డేశారు.. చివ‌రికి!
X

దిశ వెబ్ డెస్క్: ఎక్క‌డైనా రోడ్డు వేస్తే దానికి అడ్డుగా ఎలాంటి వ‌స్తువులు లేకుండా చూసుకుంటారు. ఏవైనా ఉంటే తీసేసి రోడ్డు వేస్తారు. కానీ బాప‌ట్ల జిల్లాలో రోడ్డుపై కారు ఉండగానే దానిని ప‌క్క‌న పెట్ట‌కుండానే రోడ్డు వేశారు. చివరికి ఆ కారును బ‌య‌ట‌కు తీయలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. బాప‌ట్ల జిల్లా వేట‌పాలెం మండ‌లం ఆమోద‌గిరిప‌ట్నంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ క్ర‌మంలో బుద్ది వెంక‌ట‌ర‌మ‌ణ అనే వ్య‌క్తి ఇంటి ముందు కారు నిలిపి ఉండ‌గా దాన్ని ప‌క్క‌న పెట్ట‌కుండా రోడ్డు వేశారు. ఏడాదికాలంగా ఆ కారు రోడ్డుపైనే ఉంటుంద‌ని పంచాయితీ కార్య‌ద‌ర్శి వెంక‌టేశ్వ‌ర్లు చెబుతున్నారు. రోడ్డు వేస్తున్నామ‌ని కారు తీయాల‌ని య‌జ‌మానికి స‌మాచారం ఇచ్చామ‌ని, కానీ ఆయ‌న విన‌కుండా వెళ్లిపోయార‌ని తెలిపారు.

గ‌తేడాది రోడ్డు మంజూరైనా కారు య‌జ‌మాని వ‌ల్ల‌నే వేయ‌లేక‌పోయామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనేక‌సార్లు చెప్పినా విన‌కుండా ఆయ‌న డోర్ వేసుకున్నార‌ని తెలిపారు. కాంట్రాక్ట‌ర్ కారు తీయ‌కుండా రోడ్డు వేసిన విష‌యం ఇప్పుడే త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని దీనిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పారు. మ‌రోవైపు కారు య‌జ‌మాని మాత్రం కాంట్రాక్ట‌ర్ సర్వే చేయ‌కుండానే రోడ్డు ప‌నులు ప్రారంభించార‌ని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట‌ర్ తీరు వ‌ల్ల త‌న‌కు న‌ష్టం జ‌రిగింద‌ని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో అటు కాంట్రాక్ట‌ర్ తీరుపైనా ఇటు కారు ఓన‌ర్ తీరుపైనా నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్ద‌రి ఈగో మ‌ధ్య‌లో ప్ర‌జాధ‌నం వృథా అయ్యే అవ‌కాశం ఉంద‌ని మండిప‌డుతున్నారు.

Next Story