సంప్రదాయ పరిశ్రమల బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తోంది

by Thanuru Gopichand |

చేనేతకారులకు కేంద్రమంత్రి భరోసా.

సంప్రదాయ పరిశ్రమల బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తోంది
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంప్రదాయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి అగస్తేశ్వర చేనేత సహకార సంఘాన్ని కేంద్రమంత్రి సందర్శించారు. పర్యటనలో భాగంగా చేనేత కార్మికులతో (Handloom Workers) కొంత సమయాన్ని గడిపారు. వారి కష్టసుఖాలు, మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను చేనేత కార్మికులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటికి సరైన పరిష్కారం చూపించాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ తరతరాలుగా సంప్రదాయ ఖాదీ నెయ్యడం కొనసాగిస్తున్న చేనేతకారుల నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. వారితో కాసేపు గడిపితే వారిలోని నైపుణ్యం గొప్పతనం తెలిసిందన్నారు. చేనేతకారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అదే విధంగా వారి వ్యాపారం, వృత్తి అభివృద్ధికి అన్ని విధాల సహాయాన్ని అందిస్తానని హామీనిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంప్రదాయ పరిశ్రమలను బలోపేతం చేస్తోందన్నారు. గ్రామీణ స్థాయిలో కళాకారులు, కార్మికులకు సాధికారత కల్పించడానికి నిబద్ధతతో పని చేస్తోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వోకల్ ఫర్ లోకల్ (Vocal For Local) పిలుపునకు అనుగుణంగా స్థానిక కుటీర పరిశ్రమలను ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతిఒక్కరం స్థానిక సంప్రదాయ ఉత్పత్తులను ఉపయోగించాలని కోరారు.

Next Story