ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో కలెక్టర్.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-28 03:01:29  IST  )

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మారువేషంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో కలెక్టర్.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు ఆమె ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

సామాన్యురాలిలా తనిఖీ..

ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి ఒక సాధారణ బాధితురాలిలా కలెక్టర్ ఆసుపత్రిలోకి వెళ్లారు. ఓపీ (OP) కౌంటర్లు, వార్డులను సందర్శించి అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న భోజనం, మందులు, ఇతర వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్‌పైనే దురుసు ప్రవర్తన..

తనిఖీ సమయంలో ఒక విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. వచ్చిన వ్యక్తి జిల్లా కలెక్టర్ అని తెలియని కొందరు ఆసుపత్రి సిబ్బంది ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. సామాన్య ప్రజల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటనతో కలెక్టర్‌కు ప్రత్యక్షంగా అర్థమైంది.

సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం..

తర్వాత తన అసలు గుర్తింపును వెల్లడించిన కలెక్టర్, రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత కలిగిన సిబ్బంది ఇలా వ్యవహరించడంపై మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రిలో మార్పులు రావాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Next Story